ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయపై పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అనసూయ తమ ఫోన్ పగలగొట్టడంతో పాటు దుర్భాషలాడిందని సదరు మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. తార్నాక ప్రాంతంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకోగా, బాధితురాలు ఉస్మానియా యూనివర్శిటీ పరిధి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

మంగళవారం హైదరాబాదులోని తార్నాక ప్రాంతానికి ఏదో పని మీద అనసూయ వచ్చారు. అదే సమయంలో తన తల్లితో పాటు అటుగా వెళుతున్న ఓ బాలుడు అనసూయ కనిపించగానే అభిమానంతో ఆమె వద్దకు వెళ్లి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు.

అయితే సదరు బాలుడు సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించడంతో యాంకర్ అనసూయ కోపోద్రిక్తురాలైంది. బాలుడి చేతిలోని ఫోన్ లాక్కుని నేలకేసి బద్దలు కొట్టింది. దీంతో తల్లీ కొడుకులతో పాటు అక్కడున్నవారంతా షాకయ్యారు.

తమ ఫోన్ బలవంతంగా లాక్కుని బద్దలు కొట్టడంపై తల్లీ కొడుకులు ఆమెను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండానే అనసూయ వారిని దుర్భాషలాడుతూ అక్కడి నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తమ ఫోన్ ధ్వంసం చేయడంతో పాటు తనను నానా మాటలు అంటూ దుర్భాషలాడిన అనసూయపై సదరు మహిళ సమీపంలోని ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

దీంతో ఇలాంటి దానికి నేను వివరణ ఇవ్వాల్సి వస్తుందని ఊహించలేదు. సోమవారం మా అమ్మను కలిసేందుకు తార్నాక వెళ్లాను. అక్కడ నేను కారు దిగి నడుచుకుంటూ వెళుతుంటే ఓ ఉమెన్, వాళ్ల బాబు స్కూటీ మీద వెళుతూ నా వీడియో తీశారు. అలా చేయవద్దన చెప్పాను. నెక్ట్స్ టైమ్ వచ్చినపుడు సెల్ఫీ ఇస్తానని చెప్పాను. నేను ఎంత చెప్పినా వారు వినలేదు. బైక్ నా ముందు వరకు వచ్చి వీడియో తీయడానికి ట్రై చేశారు. నేను నా ఫేస్ కవర్ చేసుకున్నాను. కొంచెం కోపంగా తిట్టాను, కానీ ఫోన్ పగలగొట్టలేదు. ఆ అబ్బాయిని కూడా ఏమీ అనలేదని అనసూయ తెలిపారు. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. వారిని నేనెప్పుడూ ఏమీ అనను. వాళ్ల అమ్మను కోపంతో తిట్టాను. వారు వినకపోతే కొంచెం అరిచాను. తప్పుకోండి అని వెళ్లిపోయాను. తప్పుకోండి అన్నపుడు ఫోన్ పడిందా? లేదా? నాకు గుర్తు లేదు. బహుషా కింద పడి పగిలిపోయిందేమో? నాకు తెలియదు అని అనసూయ తెలిపారు. ఫోన్ తీసి పగలగొట్టడం, పిల్లలను అబ్యూస్ చేయడం లాంటి పనులు నేను చేయను. నేను చాలా అరుదుగా నా అభిమానులను సెల్పీలు తీసుకోవడానికి నిరాకరిస్తాను. నిన్న నేను ఏదో టెన్షన్లో ఉండి అలా చేశాను అని అనసూయ వివరణ ఇచ్చారు.

అంతేకాక అనసూయ.. జరిగిన ఘటన పట్ల నిజం తెలియకుండానే అంతా రకరకాలుగా పుకార్లు సృష్టిస్తున్నారని అనసూయ తెలిపింది. ఇలా ప్రవర్తించడం చాలా హర్ట్ చేస్తోందని అనసూయ అంది. అయితే ఇంతటితో ఈ అంశానికి పుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నానన్నారు. నన్ను నమ్మిన వారికి, నాకు మద్దతుగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అనసూయ అన్నారు.