బ్రిటన్లో పుట్టి, ఇండియన్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగి, ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ '2.0' చిత్రంలో రజనీకాంత్ సరసన నటించే అవకాశం దక్కించుకున్న అమీ జాక్సన్ త్వరలో పెళ్లి కూతురు కాబోతోంది. ఈ ఏడాది అమ్మడి వివాహం జరుగబోతున్నట్లు బ్రిటన్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

అమీ జాక్సన్ 2015 నుండి మల్టీ మిలియనీర్ జార్జ్ పనయిటూతో ప్రేమాయణం సాగిస్తోంది. ఇంత కాలంగా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత వాలంటైన్స్ డే సందర్భంగా తమ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి ఓపెన్ అయిపోయారు.

అమీ-జార్జ్ ఈ ఏడాదే వివాహం చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ప్లానింగులోనే ఉన్నారట. కనీవినీ ఎరుగని రీతిలో గ్రాండ్‌గా వీరి పెళ్లి వేడుక జరుగనుందట. త్వరలో ఈ జంట నుండి మనం గుడ్ న్యూస్ వినబోతున్నాం.

వాస్తవానికి 2017 సంవత్సరంలోనే వీరి వివాహ వేడుక జరుగాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల అప్పుడు వీలు కాలేదు. అపుడు అమీ జాక్సన్ 2.0 షూటింగులో బిజీగా ఉండటం కూడా ఓ కారణం. ఈ ఏడాది మంచి టైమ్ చూసుకుని ఇద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారు.

జార్జ్ పనయిటూ...... బ్రిటన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అండ్రియాస్ పనయిటూ కుమారుడు. వీరి ఫ్యామిలీకి విలాసవంతమైన హోటళ్లను నడిపే వ్యాపారం కూడా ఉంది. ది ఎబిలిటి గ్రూప్ అనే సంస్థకు జార్జ్ అధినేతగా వ్యవహరిస్తున్నారు.

అమీ జాక్సన్ నటించి ‘2.0' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఈచిత్రంలో ఆమె లేడీ రోబోగా కనిపించనుంది. దీంతో పాటు ఆమె నటిస్తున్న కన్నడ మూవీ‘ది విలన్' చిత్రీకరణ దశలో ఉంది. ఈ రెండు చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.