నేను చెప్పేదే నిజం.. జయ మా అమ్మే.. ఆధారాలివిగో..

First Published 4, Dec 2017, 9:56 AM IST
amrutha approaches karnataka high court to prove jayalalitha her mother
Highlights
  • తాను జయ కూతురునేనంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన అమృత
  • డీఎన్ఏ పరిక్షకు సిద్ధమని కోర్టుకు తెలిపపిన అమృత
  • సీసీ టీవీ ఫుటేజీల్లో, పోయెస్ గార్డెన్ విజిటర్స్ రికార్డులు పరిశీలించాలంటున్న అమృత
  • శోభన్ బాబు, జయల కూతురు అమృత అని చెప్పిన జయ సన్నిహితురాలు గీత

దక్షిణాది అలనాటి అందాల తార, తమిళుల అమ్మ జయలలిత కూతురిని తానే అంటూ గతంలో కోర్టును ఆశ్రయించి భంగపడ్డ అమృత మరోసారి తాను జయలలిత కూతురునని, అవసరమైతే డీఎన్ఏ పరిక్షకు సిద్ధమని స్పష్టం చేయటంతో తమిళనాట మరోసారి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. తాను జయలలిత కుమార్తెననే నిజం ఇటీవలే తనకూ తెలిసిందని, దానిని ధ్రువీకరించుకున్న తర్వాతే తెరపైకి వచ్చానని బెంగళూరుకు చెందిన అమృత తెలిపారు.

 

తన పెంపుడు తల్లి లలిత 2015లో మరణించిందని, అప్పటివరకు ఆమె కుమార్తెనేనని భావించానని అమృత తెలిపారు. పెంపుడు తండ్రి సారథి 2017 మార్చిలో చనిపోయే ముందు నువ్వు జయలలిత కుమార్తెవని చెప్పడంతో వెంటనే నిర్ధారించుకోలేకపోయానని చెప్పారు. తర్వాత తన బంధువులను విచారించగా జయలలితకు కుమార్తె ఉన్న విషయం నిజమేనని, అది తానేనని చెప్పడంతో ఇప్పుడు వెల్లడించానని పేర్కొన్నారు.

 

1996 జూన్‌ 6న తొలిసారిగా జయలలితను చూశానని, అప్పుడు ఆమె అధికారం కోల్పోయిన మానసిక ఒత్తిడిలో ఉన్నారని అమృత తెలిపారు. తనను చూసిన వెంటనే ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకున్నారని, అది తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెను పలుమార్లు కలిశానని తెలిపారు. ఒకే పళ్లెంలో తిన్నామని, ఒకే పడకపై నిద్రించామని వివరించారు. జయలలితను చూసేందుకు తాను సచివాలయానికి వెళ్లిన ప్రతిసారి ‘నువ్వు ఎక్కడైనా ఉండు. ప్రాణాలతో ఉంటే చాలు’ అనేవారని అమృత పేర్కొన్నారు.

 

జయ ఆస్పత్రిలో చేరడానికి ముందు.. ఫోన్‌ చేసి చూడటానికి వస్తున్నట్టు చెబితే వద్దని వారించారని వివరించారు. తాను ఇంట్లో ఉండట్లేదని తెలిపారని పేర్కొన్నారు. అయినా తాను పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయానికి వెళ్లగా ఆమె లేరని చెప్పారని, తర్వాత విచారించగా ఆమెకు ఇంట్లోనే వైద్యచికిత్సలు అందిస్తున్నట్టు తెలిసిందని వివరించారు.

 

జయలలితను పలుమార్లు కలిసినందుకు ఆధారంగా సీసీ టీవీ కెమెరాల ఫుటేజీలు ఉండొచ్చని  అమృత తెలిపారు. జెడ్‌ కేటగిరీ రిజిస్ట్రర్‌లోనూ ఈ వివరాలు ఉంటాయని చెప్పారు. తాను డీఎన్‌ఏ పరీక్ష ద్వారా జయలలిత కుమార్తెనని నిరూపించాల్సి ఉన్నట్టు భావిస్తున్నానని పేర్కొన్నారు. జయలలిత మరణించడానికి ముందుగా స్పృహలో ఉంటే ఖచ్చితంగా తనతో మాట్లాడి ఉండేవారని తెలిపారు. శశికళ కుటుంబ సభ్యులు తమను జయలలితను కలవకుండా పలుమార్లు అడ్డుకున్నారని అమృత ఆరోపించారు.

 

మరోవైపు తనకు శోభన్ బాబుతో వున్న బంధం గురించి జయలలిత స్వయంగా ఓ పత్రికకు రాసిన లేఖ తాజాగా బైయపడింది. దాంట్లో శోభన్ బాబుతో తాను సహజీవనం చేస్తున్నానని, అయితే ఆయన వివాహితుడు కావడం వల్లే పెళ్లి చేసుకోలేకపోతున్నానని 1979లోనే జయలలిత అంగీకరించినట్లు తెలుస్తోంది. డాక్టర్ బాబు సినిమాలో కలిసి నటించిన వీరిరువురి మధ్యా ఆ తర్వాత స్నేహం బలపడిందని తెలిస్తోంది.

 

స్టార్ అండ్ స్టైల్ అనే ఆంగ్ల పత్రికకు అప్పట్లో జయలలితే స్వయంగా లేఖ రాశారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాదు.. జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్థుతం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన అమృత విషయంలో కోర్టు ఏం చేస్తుందో చూడాలి.

loader