Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: అమ్మమ్మగారిల్లు

లవ్ స్టోరీస్, యాక్షన్ సినిమాలలో నటించాలని కోరుకునే యంగ్ హీరోలు 

ammammagarillu movie telugu review

నటీనటులు: నాగశౌర్య, షామిలి, రావు రమేష్, సుమిత్ర తదితరులు 
సంగీతం: కళ్యాణ రమణ 
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్ 
ఎడిటింగ్: జె.పి
నిర్మాత: రాజేష్ 
కథ-కథనం-మాటలు-దర్శకత్వం: సుందర్ సూర్య 

లవ్ స్టోరీస్, యాక్షన్ సినిమాలలో నటించాలని కోరుకునే యంగ్ హీరోలు ఈ మధ్యకాలంలో కుటుంబ కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే హీరో నాగశౌర్య 'అమ్మమ్మగారిల్లు' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటించాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో సూర్యనారాయణ(చలపతిరావు), సీతామహాలక్ష్మి(సుమిత్ర) భార్యాభర్తలకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఉమ్మడి కుటుంబంతో సంతోషంగా ఉండేవారు. ఆ ఇంటి పెద్ద కొడుకు(రావు రమేష్) ఆస్తి పంచుకొని సిటీకు వెళ్లి సెటిల్ అవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలో కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో మనస్పర్ధలు చోటుచేసుకుంటాయి. వాటి కారణంగా ఆ ఇంటి పెద్ద చనిపోతాడు. దీంతో కుటుంబం చెల్లా చెదురవుతుంది. ఎవరికీ వాళ్లు దూరంగా వెళ్లిపోతారు. అలా విడిపోయిన కుటుంబాన్ని మళ్లీ ఒకటిగా చేయాలని ఆశ పడుతుంది సీతామహాలక్ష్మి. తన అమ్మమ్మ కోరికను తీర్చాలని నిర్ణయించుకుంటాడు మనవడు సంతోష్(నాగశౌర్య). ఇరవై ఏళ్ల క్రితం విడిపోయిన కుటుంబాన్ని అతడు మళ్లీ ఎలా కలిపాడనేదే ఈ సినిమా. 

నటీనటుల పనితీరు: 
హీరో నాగశౌర్య నటన విషయంలో చాలా పరిణితి చెందాడు. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ సీన్స్ లో బాగా నటించాడు. రావు రమేష్ తో అతడి కాంబినేషన్ సీన్లు బాగున్నాయి. ఈ సినిమాలో రావు రమేష్ నటన హైలైట్ గా నిలిచింది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడు. కుటుంబ కథలకు రావు రమేష్ అవసరం ఎంతో ఉందని ఈ సినిమాతో మరోసారి నిరూపించాడు. ఎమోషనల్ సీన్స్ లో అతడి నటన మెప్పిస్తుంది. హీరోయిన్ షామిలి హీరో మరదలి పాత్రలో బాగానే నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ ఆకట్టుకుంటుంది. ఇక సినిమా హీరో ఫ్రెండ్ గా షకలక శంకర్ చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. సినిమా కాస్త స్లోగా ఉందని ఆడియన్స్ అనుకునే ప్రతిసారి షకలక శంకర్ తన డైలాగ్స్ తో  నవ్వించాడు. పోసాని గుర్తుండిపోయే పాత్రలో నటించారు. శివాజీరాజా, సుమిత్ర, రవిప్రకాష్ వంటి నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. 

సాంకేతికవర్గం పనితీరు: 
కెమెరా పనితనం పెద్దగా ఆకట్టుకోదు. పాటల్లో విజువల్స్ ను మాత్రం అందంగా చూపించే ప్రయత్నం చేశారు. కళ్యాణ్ రమణ అందించిన నేపధ్య సంగీతం బాగుంది కానీ పాటలు చెప్పుకునే స్థాయిలో లేవు. ఒకటి రెండు పాటలు వినడానికి బాగానే అనిపిస్తాయి. సినిమాలో కొన్ని సన్నివేశాలను సాగదీసి చూపించారు. వాటిని ఎడిట్ చేస్తే సినిమా బాగుండేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా సుందరు రాసుకున్న కథ రొటీన్ గా ఉన్నప్పటికీ సరైన ఎమోషన్ పండించి ఉంటే మరింత బాగుండేది. కథ కోసం ఎన్నుకున్న నేపధ్యం, దాని ద్వారా చెప్పాలనుకున్న సందేశం బాగున్నాయి.డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కథను బాగానే హ్యాండిల్ చేశాడు.  

కథనం-విశ్లేషణ: 
కుటుంబ నేపధ్యంతో ఎన్ని చిత్రాలు రూపొందించినా కంటెంట్ ఉంటే ఆడియన్స్ ఆ సినిమాలను ఆదరిస్తూనే ఉంటారు. అమ్మమ్మగారిల్లు సినిమా కూడా ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో రూపొందించినదే. తెలిసిన కథే అయినప్పటికీ ఎమోషనల్ గా కొన్ని సన్నివేశాలు బాగానే కనెక్ట్ అవుతాయి. సినిమాను చూస్తున్నంతసేపు 'శతమానంభవతి' సినిమా గుర్తొస్తుంది. కథలో ఆ ఛాయలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూశామనే భావాన మాత్రం కలుగుతుంది. సినిమా మొదలుపెట్టిన తీరు ప్రధమార్ధం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మామ, అల్లుళ్ల మధ్య రాసుకున్న సన్నివేశాలు సినిమాకు ప్రాణం పోశాయి. హీరో తన మరదలి లవ్ ట్రాక్ మాత్రం పెద్దగా ఆకట్టుకోదు. ఆ సన్నివేశాల్లో డెప్త్ మిస్ అయింది. దర్శకుడు రాసుకున్న ట్విస్ట్ లు ప్రేక్షకుడు ముందే ఊహించగలడు. క్లైమాక్స్ ఎపిసోడ్ లో సాగే డ్రామా విసిగిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఫన్, ఎంటర్టైన్మెంట్ సెకండ్ హాఫ్ లో ఉండదు. కొన్ని చోట్ల నెమ్మదిగా సాగిన కథనం సినిమాకు మైనస్ అయింది. ఈ కథ ద్వారా డబ్బు కంటే మనుషులు బంధాలే ముఖ్యమని దర్శకుడు చెప్పిన సందేశం అభినందనీయం. ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందో సందేహమే!

రేటింగ్: 2.5/5 

Follow Us:
Download App:
  • android
  • ios