మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న సినిమా 'సై రా నరసింహారెడ్డి' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. షూటింగ్ మొదలై ఇంతకాలం అవుతున్నా.. ఇప్పటివరకు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

మొదట ఏఆర్ రెహ్మాన్ అని అనౌన్స్ చేయగా, డేట్స్ క్లాష్ అవుతున్నాయని ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తరువాత తెరపైకి కీరవాణి పేరు వచ్చింది. కానీ ఆయన కూడా సినిమా చేయడం లేదని సమాచారం. థమన్ తో సినిమా మోషన్ పోస్టర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించడంతో  ఆయన్నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటానే వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ నుండి మ్యూజిక్ డైరెక్టర్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. అమిత్ త్రివేదిని ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఫైనల్ చేసినట్లు టాక్.

ఇప్పటికే అమిత్ ఈ సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న సినిమా టీజర్ ను విడుదల చేయనున్నట్లు సమాచారం. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్, నయనతార,. విజయ్ సేతుపతి వంటి తారలు కనిపించనున్నారు.