అల్లు శిరీష్ థ్రిల్లర్ జోనర్ లో నటించిన చిత్రం 'ఒక్క క్షణం'. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అనుకున్న రేంజ్ లో సినిమా ఆడలేదనే చెప్పాలి. అయినా ఈ సినిమా తన కెరీర్ కు మేలే చేసిందని అంటున్నాడు అల్లు శిరీష్. అదెలా అంటే.. శిరీష్ నటించిన 'ఒక్క క్షణం' సినిమా కారణంగానే తనకు స్టార్ హీరో సూర్య సినిమాలో నటించే అవకాశం వచ్చిందట.

దర్శకుడు కెవి ఆనంద్ ఓ యంగ్ హీరో కోసం చూస్తున్నప్పుడు శిరీష్ స్నేహితుడు ఒకరు ఆయన గురించి సిఫార్సు చేశారట. శిరీష్ నటించిన సినిమాలు తను చూడలేదని దర్శకుడు చెప్పగానే 'ఒక్క క్షణం' సినిమా డివిడి పంపించారట. ఆ సినిమా చూసే కెవి ఆనంద్ తన సినిమాలో శిరీష్ కు ఛాన్స్ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారని కూడా అన్నారు.

సూర్య, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలు నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ జూలై 1నుండి మొదలుకానుంది. సెప్టెంబర్ నెలలో శిరీష్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.