తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు 2024 ప్రదానోత్సవంలో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డుని అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాస్ డైలాగ్‌తో ఉర్రూతలూగించారు.
తెలంగాణ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులు ప్రదాన వేడుక శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని హైటెక్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఇందులో పలువురు విజేతలకు ఆయన అవార్డులు ప్రదానం చేశారు. అందులో భాగంగా 2024 ఏడాదికిగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అందుకున్నారు. `పుష్ప 2` చిత్రానికిగానూ బన్నీ ఈ పురస్కారం గెలుచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డుని అందుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన బన్నీ
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడారు. `ఇలాంటి ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డులను అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇదొక గొప్ప ప్రయత్నం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నగారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, దిల్ రాజుగారికి అందరికి ధన్యవాదాలు.
ఈ అద్బుతానికి కారణమైన దర్శకుడు సుకుమార్‌కి ధన్యవాదాలు. ఈ అవార్డు రావడం పూర్తిగా మీ విజన్ వల్లే సాధ్యమైంది. అలాగే నా నిర్మాతలు, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లకి ధన్యవాదాలు.
రాజమౌళికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్
ఈ సందర్భంగా రాజమౌళిగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరు ఆ రోజు `పుష్ప` చిత్రాన్ని హిందీ రిలీజ్ చేయమని చెప్పకపోతే ఇంతటి విజయం ఉండేది కాదు. మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నా. `పుష్ప 2` సినిమా గెలిచిన మొదటి అవార్డు ఇది.
ఈ పురస్కారాన్ని నా అభిమానులకు అంకితమిస్తున్నా. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలి, అదే సమయంలో మిమ్మల్నిఎప్పుడూ గర్వపడేలా చేస్తాను` అని తెలిపారు బన్నీ.
`పుష్ప 2` చిత్రంలోని మాస్ డైలాగ్‌తో అల్లు అర్జున్ రచ్చ
ఈ సందర్భంగా `పుష్ప2` సినిమాలోని డైలాగ్‌ని స్టేజ్‌పై చెప్పి ఆశ్చర్యపరిచారు. `ఆ బిడ్డమీద ఒక్క గీటు పడ్డ గంగమ్మ జాతరలో యాట తలనరికినట్టు రఫ్ఫా రఫ్ఫా నరుకుతా ఒక్కొక్కడిని. పుష్ప, పుష్పరాజ్ అస్సలు తగ్గేదెలే` అంటూ మాస్ డైలాగ్ చెప్పి ఉర్రూతలూగించారు బన్నీ. సీఎం రేవంత్ రెడ్డి ముందు ఆయన ఈ డైలాగ్ చెప్పడం విశేషం. దీన్ని సీఎం కూడా ఎంజాయ్ చేశారు. నవ్వుతూ కనిపించడం విశేషం.