Allu Aravind: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటీటీల కాలం ముగిసిపోయిందని, వాటిని నమ్ముకుని సినిమాలు తీయొద్దని నిర్మాతలకు ఆయన గట్టిగా హెచ్చరించారు. ఓటీటీలను నమ్ముకొని సినిమాలు తీస్తే మీ కొంప కొల్లేరే అని ఓపెన్‌గా చెప్పేశారు అల్లు అరవింద్‌.

ఓటీటీల పని అయిపోయింది- అల్లు అరవింద్‌

`ఓటీటీలను నమ్ముకుని సినిమాలు తీయకండి. వాటి కాలం ముగిసిపోయింది`. ఈ మాటలు అన్నది మరెవరో కాదు, ప్రముఖ స్టార్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'కు యజమాని అయిన అల్లు అరవిందే ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీలో పెద్ద చర్చే మొదలైంది. చాలామంది ఆయన మాటలతో ఏకీభవిస్తుంటే, మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారు? ఎందుకు చెప్పారనేది చూస్తే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

స్టార్‌ ప్రొడ్యూసర్‌గా రాణించిన అల్లు అరవింద్‌

అల్లు అరవింద్‌.. ఒకప్పుడు అనేక సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. తన అభిరుచిని చాటుకున్నారు. తన గీతా ఆర్ట్స్ బ్యానర్‌ నుంచి ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌ చిత్రాలు చేయడానికి సాహసించడం లేదు. చివరగా వీరి బ్యానర్‌ నుంచి `తండేల్‌` వచ్చి మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయినా కూడా కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా థియేట్రికల్‌గా వర్కౌట్‌ కాకపోవడం వల్లే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఓటీటీల కోసం సినిమాలు తీయోద్దు 

ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అరవింద్‌ ఓటీటీలపై స్పందించారు. ఓటీటీల పని అయిపోయిందన్నారు. ఓటీటీల నమ్ముకొని సినిమా తీసే రోజులు పోయాయని చెప్పారు. వాటిని నమ్ముకొని సినిమాలు చేస్తే నష్టపోవాల్సిందే అని, ఓటీటీలు ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా ఉంటున్నాయని, తమకు నచ్చిన కంటెంట్‌ని కొంటున్నాయని, అది కూడా పెద్ద సినిమాలనే ఎక్కువగా కొంటున్నాయని తెలిపారు. గలాటాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చెప్పాడనేది చూస్తే, 

అల్లు అరవింద్‌ చెప్పిన విషయాలు ఇవే

1. సినిమా బడ్జెట్‌లో సగం డబ్బులు ఓటీటీ బిజినెస్ నుంచే వస్తాయనే ఆశలు పెట్టుకోవద్దు. ఇప్పుడు రోజులు మారాయి. ఓటీటీల యుగం ముగిసింది.

2. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా తమకు ఎలాంటి కంటెంట్ కావాలి, ఏది వద్దు అనే విషయంలో చాలా సెలెక్టివ్‌గా ఉంటున్నాయి. అందుకే, ఒకప్పటిలా నిర్మాతలు అడిగినంత డబ్బు ఇవ్వడానికి ఓటీటీలు సిద్ధంగా లేవు.

3. కేవలం కొందరు స్టార్ డైరెక్టర్లు, హీరోల సినిమాలను మాత్రమే ఎలాంటి షరతులు లేకుండా తీసుకుంటున్నారు. కానీ, గతంలోలా అన్ని రకాల సినిమాలకు డబ్బులిచ్చి కొనడం లేదు.

వాళ్లకి అల్లు అరవింద్‌ వార్నింగ్‌

`నేను మా ప్రొడక్షన్ హౌస్‌లోని క్రియేటివ్ హెడ్స్‌కు కూడా ఈ విషయంపై గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. థియేటర్లలో కచ్చితంగా హిట్టయ్యే డైరెక్టర్-హీరో కాంబినేషన్ల సినిమాలపైనే డబ్బులు పెట్టమని చెప్పాను. ఎందుకంటే, థియేటర్లలో ఫెయిలైన సినిమాలకు ఏ ఇతర ప్లాట్‌ఫామ్‌లోనూ చోటు దొరకదు` అని చెప్పినట్టు వెల్లడించారు అల్లు అరవింద్‌. ఆయన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ గా మారాయి.