చిత్రం: మేడ మీద అబ్బాయి జేనర్: రొమాంటిక్ కామెడీ నటీనటులు: అల్లరి నరేష్, నిఖిలా విమల్, అవసరాల శ్రీనివాస్, తులసి, సత్యం రాజేష్, జబర్దస్త్ ఆది తదితరులు సంగీతం: షాన్ రహమాన్ దర్శకత్వం: ప్రజిత్.జి నిర్మాత : బొప్పన చంద్రశేఖర్ ఆసియానెట్ రేటింగ్: 2.5/5
అల్లరి నరేష్.. హిట్ కొట్టి చాలా కాలం అయింది. టైం కలిసిరాక చేసిన సినిమాలు అన్ని ప్లాప్ అవుతున్నాయి. సుడిగాలి సినిమా తర్వాత అల్లరి నరేష్ ఓ మంచి హిట్ కొట్టలేకపోయాడు. మధ్యలో జేమ్స్ బాండ్ వచ్చినా.. అది ఓ రేంజ్ లో మాత్రం హిట్ కాలేదు. దాంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని.. అల్లరి నరేష్, శ్రీనివాస్ అవసరాల, హైపర్ ఆది, నిఖిల తదితరల కాంబినేషన్ లో ప్రజీత్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా మేడ మీద అబ్బాయి. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ:
శ్రీను(నరేష్) ఇంజనీరింగ్‌లో 26 సబ్జెక్టులూ ఫెయిల్ అవుతాడు. చదువు పెద్దగా అబ్బని శ్రీనుకి సినిమా డైరెక్టర్ కావాలని కల. దానికోసం తన స్నేహితులతో కలిసి లఘు చిత్రాలను రూపొందిస్తుంటాడు. కానీ వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. కొన్నిరోజులకు శ్రీను ఎదిరింట్లోకి సింధు(నిఖిల) అనే అమ్మాయి అద్దెకు దిగుతుంది. తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు శ్రీను. అయితే స్నేహితులకు మాత్రం సింధు తనను ప్రేమిస్తుందని గొప్ప కోసం చెబుతాడు శ్రీను.
ఇంట్లో తన తండ్రి (జయప్రకాష్) పోరు పడలేక, ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ బయలుదేరతాడు శ్రీను. తను ఎక్కిన ట్రైన్‌లోనే సింధు కూడా ఉంటుంది. ఆమెతో ఓ సెల్ఫీ తీసుకొని తన స్నేహితులకు పంపిస్తాడు శ్రీను. ఆ సెల్ఫీతో శ్రీను జీవితం సమస్యలు మొదలవుతాయి. శ్రీనుకి ఎదురైన సమస్యలేంటి..? శ్రీనుకి హైదరాబాద్‌లో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి..? తిరిగి ఇంటికి చేరుకున్నాడా..? అసలు సింధు స్టోరీ ఏంటి..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
ఎలావుందంటే :
మలయాళంలో విజయం సాధించిన ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే సినిమాకు రీమేక్‌గా ‘మేడమీద అబ్బాయి’ని తెరకెక్కించారు. మలయాళంలో ఈ సినిమా విజయం సాధించడానికి కారణం కథను ఊహించని మలుపులతో చిత్రీకరించడమే. అయితే తెలుగులో మాత్రం అది మిస్ అయింది. కథలో మెయిన్ పాయింట్‌ను తీసుకొని తెలుగు ప్రేక్షకులకు తగినట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సినిమా మొదటి భాగంలో హీరో తన స్నేహితులతో కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేయడం, కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు.
రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సూపర్ అని చెప్పాలి. అల్లరి నరేష్ తనదైన శైలీలో వినోదానికి అందించాడు. ఉత్కంఠభరిత సన్నివేశాలు సినిమాలో హైలైట్. జబర్దస్త్ ప్రోగ్రాం తో హైలైట్ అయిన హైపర్ ఆది, ఈ సినిమాలో నరేష్ కు ఫ్రెండ్ గా నటించాడు. ఆది తనదైన శైలిలో పంచ్ డైలాగ్స్ తో సినిమా అంత నవ్వులు పోయించాడు. అంతే కాదు ఈ సినిమాకు మాటలు అందించింది కూడా ఇతడే. ఇందులో డైలాగ్స్ తో పాటు ఉన్ని ఎస్. కుమార్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
ఎప్పుడైతే హీరోయిన్‌తో హీరో సెల్ఫీ తీసుకుంటాడో.. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. చిన్న ట్విస్ట్‌తో ఇంటర్వల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం చాలా సీరియస్ మోడ్‌లో నడుస్తుంటుంది. ఒక వ్యక్తి కోసం హీరో, హీరోయిన్ చివరి వరకూ వెతుకుతూనే ఉండడంతో సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో ఓ సందేశంతో సినిమాను పూర్తి చేశారు. అల్లరి నరేష్ ఎలాంటి స్పూఫ్‌లు చేయకుండా తనదైన నటనతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యాడు.
నిఖిలా విమల్ తన నటనతో ఓకే అనిపించింది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఏమంత ఆకట్టుకోదు. హైపర్ ఆది పండించిన కామెడీ నవ్విస్తుంది. అవసరాల శ్రీనివాస్ పాత్ర కథకు అవసరం లేదనిపిస్తుంది. మిగిలిన నటులు తమ పాత్రల పరిధుల్లో బాగానే నటించారు. పాటలు గుర్తుపెట్టుకునే విధంగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగా వుంది. మొత్తానికి మలయాళంలో సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రజిత్.. తెలుగులో మాత్రం సినిమాను ఆశించిన స్థాయిలో నిలబెట్టలేకపోయాడు.
ప్లస్ పాయింట్స్ :
- అల్లరి నరేష్, హైపర్ ఆది కామెడీ
- నిఖిల విమల్ , అవసరాల శ్రీనివాస్ రోల్స్
- పంచ్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
- కొన్ని చోట్ల రొటీన్ కామెడీ
- హీరో, హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్
- సంగీతం
చివరగా :
ఈ మూవీ లో అల్లరి నరేష్ కామెడీ బాగా వర్కవట్ అయింది. అలానె హైపర్ ఆది పంచ్ డైలాగ్స్ బాగున్నాయి. ఓ డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొత్త నరేష్ ను చూసిన ఫీలింగ్ కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయాడని చెప్పొచ్చు.
