---సూర్య ప్రకాష్ జోశ్యుల

సాధారణంగా కొత్తగా పరిచయం అయ్యే హీరోలు (మరీ ముఖ్యంగా సాఫ్ట్ లుక్ ఉన్నవాళ్లు) లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూంటారు. అందులోనూ అక్కినేని వారసత్వం అంటే లవ్ స్టోరీలతో ముడిపడి ఉంది. అయితే అక్కినేని అఖిల్  రూటే వారు. మొదటనుంచీ  మాస్ హీరో అనిపించుకోవాలని తన పేరునే టైటిల్ గా పెట్టుకుని అఖిల్ అన్నాడు.  వర్కవుట్ కాలేదు. ఇది కాదు పద్దతి అని కొద్దిగా మాస్ తగ్గించుకుని క్లాస్ డైరక్టర్ తో 'హలో' అన్నాడు.

అది కొద్దిగా బెటర్ అనిపించుకుంది  కానీ పొలో మంటూ జనాల్ని రప్పించుకోలేకపోయింది. కానీ కొద్దిగా క్లారిటీ ఇచ్చింది. దాంతో ఈ సారి ..బాగా మాస్ తగ్గించుకుని, లవ్ స్టోరీతో  'మిస్ట‌ర్ మ‌జ్ను' అంటూ తన కుటుంబ వారసత్వాన్ని గుర్తు చేస్తూ ఈ సారి ధియోటర్స్ లోకి దూకాడు.   ఈ  మార్చిన  స్ట్రాటజీ అఖిల్ కెరీర్ కు  ఎంతవరకూ వర్కవుట్ అయ్యింది.  లవ్ స్టోరీలతో అయినా అఖిల్ నిలబడగలననే థీమా ఇచ్చిందా...ఈ చిత్రం కథేంటి, ప్లస్ లు, మైనస్ లు ఏంటో రివ్యూలో చూద్దాం. 

 

కథేంటి..

విక్కి (అఖిల్) కాసనోవా టైప్. లండన్  లో ఎంఎస్ చేసే అతని చుట్టూ అమ్మాయిలు తూనీగల్లా పరిభ్రమిస్తూంటారు. మరో ప్రక్క అక్కడే ఉన్న  నిక్కి (నిధి అగర్వాల్) ది శ్రీరాముడు లాంటి భర్త కావాలనునే క్యారక్టర్. వీళ్లద్దరు కలవాలని రాసిపెట్టినట్లుంది. ఇద్దరూ ఒకే పెళ్లికి హాజరవటానికి ఇండియాకు వస్తారు.యాక్సిడెంటల్ గా  ఎయిర్ పోర్ట్ లో పరిచయమైన వీళ్లిద్దరూ ఆ పెళ్లి లో మరింత దగ్గరయ్యే అవకాశం వస్తుంది.  మొదట్లో విక్కీ  అమ్మాయిలతో మెలిగే పద్దతి చూసి ద్వేషించినా...  అతని  వ్యక్తిత్వం తో ప్రేమలో పడి  ప్రపోజ్ చేస్తుంది.  రెండు నెలలు పాటు రిలేషన్ షిప్ లో ఉందామంటుంది.  

అయితే విక్కీ మాత్రం నువ్వు చెప్పే సిన్సియర్ లవ్ నా వల్ల కాదు అంటూ ఆమె నుంచి దూరం జరుగుతూంటాడు.   కానీ నిక్కి మాత్రం అత‌ని మీద అతి ప్రేమ‌ను చూపిస్తుంది. అప్ప‌టివ‌ర‌కు అలాంటి ప్రేమ‌ను చూడని విక్కీకి అది చాలా అతిగా  ఫీలవుతాడు. ఆ అతి నుంచి  బ‌య‌ట‌కు రావాల‌నుకుంటాడు. ఆ విష‌యాన్ని నిక్కీతో కాకుండా, త‌న ఫ్రెండ్‌తో చెబుతాడు. చాటుగా వింటుంది నిక్కి. ఆత్మాభిమానం ఉన్న ఆమె విక్కీ నుంచి దూరం జ‌రుగిపోయి తిరిగి లండన్ వెళ్లిపోతుంది.  

ఆమె నుంచి దూరమయ్యాక..ఆమె లేని లోటు ఫీలవుతాడు. ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు.  ఆమెను ఇంప్రెస్ చేయ‌డ‌మే  ప‌నిగా పెట్టుకుంటాడు.  చివరకు నిక్కి..విక్కిని ఎలా ఏక్సెప్ట్ చేసింది. నిక్కిని తన దాన్ని చేసుకోవటానికి విక్కి చేసిన ప్రయత్నాలు ఏమిటి ?  వంటి  విషయాలు తెలయాలంటే ఈ  సినిమా చూడాల్సిందే.

కథా,కథనం ఎలా ఉన్నాయి..

కథగా పైన మీరు చదివింది ..పరమ రొటీన్ గా అనిపించింది కదా..హీరో,హీరోయిన్ మొదట ద్వేషించుకుంటారు. ఆ తర్వాత కలుస్తారు.చిన్న చిన్న అభిప్రాయ భేధాలతో విడిపోతారు. ఆ తర్వాత ఒకరి ప్రేమ ..మరొకరు తెలుసుకుని ఒకటవుతారు. ఇది ఫెరఫెక్ట్ గా రొమాంటిక్ కామెడీల్లో జరిగే ప్లేనే. అయితే కథ కొత్త బ్యాక్ డ్రాప్ లో జరిగితే ఫార్ములా పాతదే అనిపించినా... సీన్స్  కొత్తవి అనిపించి బాగుండేది. కానీ కాసనోవ ఎలిమెంట్ తప్ప మిగతాదంతా పాతగానే అనిపిస్తుంది. అదే సెకండాఫ్ ని దెబ్బ కొట్టింది. ఏదో ఆల్రెడీ చూసేసిన సినిమా మళ్లీ చూస్తున్నట్లు ఫీలింగ్ వచ్చింది. దానికి తోడు లెంగ్త్ కూడా సినిమాపై గౌరవాన్ని తగ్గించుకుంటూ పోయింది.

దాంతో ఫస్టాఫ్ మంచి ఫీల్ గుడ్ సినిమా చూసినట్లు అనిపించినా, సెకండాఫ్ ..కదలని కొండ చిలవను భుజాన వేసుకున్నట్లు బరువుగా అనిపిస్తుంది.  చాలా స్లోగా నడిపిన నేరేషన్... ఎంతకీ ఈ సినిమా పూర్తవ్వదా అనిపించింది. చాలా ప్లాట్ గా , ఎక్కడా సర్పైజ్ ఎలిమెంట్స్ అనేవి లేకుండా కథనం రాసుకోవటంతో పూర్తి గా ప్రెడిక్టబుల్ గా మారిపోయింది. పోనీ క్లైమాక్స్ లో అయినా ఏమన్నా కుదుపుతాడేమో...దాన్ని లేపటం కోసమే ...అలా నడిపాడేమో అనుకుని ఆశపడితే..అది మీ అత్యాశే అంటూ నాలుకు బయిటపెట్టి వెక్కిరించేస్తాడు దర్శకుడు.

 

అఖిల్ ఎలా చేసాడు..

మొదటి సినిమా నుంచి అఖిల్ నటనలో పెద్దగా వంక పెట్టడానికి వీల్లేనట్లుగానే చేస్తున్నాడు. ముఖ్యంగా డైలాగు డెలవరీ మాత్రం చాలా బాగుంది. అయితే ఎమోషనల్ సీన్స్ లో ఇంకాస్త డెప్త్, పట్టు కనపడాలి.,అది అనుభవంతో వస్తుందమో. నిథి అగర్వాల్ ...అద్బుతంగా చేసింది అనటం కన్నా అందంగా కనపడింది అని చెప్పాలి. ప్రియదర్శిని కామెడీ టైమింగ్ కు వంక పెట్టేదేముంది. హైపర్ ఆది...కేవలం డైలాగుల మీదే ఆధారపడుతున్నాడు. అది జరర్దస్త్ కు ఓకే కాని, సినిమా అనేది విజువల్ మీడియా..అంత టాలెంట్ ఉన్న వ్యక్తి..ఆ ఒక్క విషయం అర్దం చేసుకుంటే తెలుగు తెరపై చెలరేగిపోవచ్చు. మిగతా ఆర్టిస్ట్ లు ...సీజనల్..ఎప్పటిలాగే తెరను అలంకరించారు.  

 

టెక్నికల్ గా...

రొమాంటిక్ కామెడీలో లవ్ సీన్స్ ఎంత ముఖ్యమో, సున్నితంగా నడిచే హాస్యం, ఆహ్లాదంగా ఉండే సంగీతం అంతే ముఖ్యం.  సినిమా ఫస్టాఫ్ లో హీరో స్నేహితుడుగా ప్రియదర్శి కామెడీ సీన్స్ బాగున్నా, సెకండాఫ్ కు వచ్చేసరికి  హైపర్ ఆది చేసిన పైరసీ పుల్లారావు పాత్ర పేలకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. ఫస్టాప్ ఉన్నట్లు సెకండాఫ్ కూడా ఉండి ఉంటే సినిమా వేరే రకంగా ఉండేది.  ఇక తమన్ ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు కానీ పాటలు జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. అయితే సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్  మాత్రం బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. లండన్ లో  సీన్స్ అన్నీ  ఆయన చాలా బ్యాటిఫుల్ గా తెరకెక్కించారు.  నవీన్ నూలి ఎడిటింగ్  లో స్పీడ్ పెంచితే ...కాస్త స్లో పేస్ తగ్గేది.   ప్రొడక్షన్ వాల్యూస్   చాలా రిచ్ గా బాగున్నాయి.

 

ఫైనల్ థాట్ 

టైటిల్ పాతది పెట్టుకున్నాం కదా అని ...  కథా,కథనం కూడా అప్పటివే అనుసరిస్తే ఎలా మిస్టర్?

 

రేటింగ్: 2/5

ఎవరెవరు

నిర్మాణ సంస్థ‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌

నటీనటులు: అఖిల్ అక్కినేని, నిధిఅగ‌ర్వాల్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, రావు ర‌మేష్‌, నాగబాబు, విద్యుల్లేఖారామ‌న్‌, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ అది, అజ‌య్‌, సుబ్బ‌రాజు త‌దిత‌రులు

సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌

కూర్పు: న‌వీన్ నూలి

ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌

నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి

 

'మిస్టర్ మజ్ను' ట్విట్టర్ రివ్యూ!

మిస్టర్ మజ్ను ప్రీమియర్ షో టాక్..!