అఖిల్ "హలో" మూవీ రివ్యూ రేటింగ్

akhil hello movie review
Highlights

  • నటీనటులు : అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ , రమ్య కృష్ణ , జగపతిబాబు
  • నిర్మాత: నాగార్జున అక్కినేని
  • దర్శకత్వం: విక్రమ్ కే కుమార్
  • సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్
  • ఎడిటర్ : ప్రవీణ్ పూడి
  • మ్యూజిక్ : అనూప్ రూబెన్స్
  • ఆసియానెట్ రేటింగ్ : 3/5

కథ:

అనాథ పిల్లాడైన శీను(అఖిల్) పార్క్ ల వెంట, వీధుల్లో తిరుగుతుంటూ బతుకుతాడు. ఓసారి పార్క్ లో తనకు రిచ్ కిడ్  జున్ను(కళ్యాణి) పరిచయమవుతుంది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు(అది సినిమా కాబట్టి ఇలాంటి నేచురాలిటీకి దగ్గరగా లేని సంఘటనలు జరగటం సహజమే). జున్ను పేరెంట్స్ కు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బదిలీ కావటంతో తను సడెన్ గా వెళ్లిపోతుంది. వెళ్లిపోయే సందర్భంలో కారులో వెళ్తూ వెళ్తూ తనకు ఫోన్ చేయమని శీనుకి వంద రూపాయల నోటు మీద ఫోన్ నంబర్ రాసిస్తుంది. కానీ శీను ఆ నెంబరున్న నోటుని పోగొట్టుకుంటాడు.

 

రోడ్డుపై  వెళ్తున్న శీను సడెన్ గా ఓ యాక్సిడెంట్ కు గురవుతాడు. ఆ యాక్సిడెంట్ చేసిన సరోజని(రమ్యకృష్ణ), ప్రకాష్(జగపతిబాబు) దంపతులకు పిల్లలు లేకపోవటంతో వాళ్లే చేరదీస్తారు. అతడిని దత్తత తీసుకొని అవినాష్‌గా పేరు మార్చి ఎంతో ప్రేమగా చూసుకుంటుంటారు. అలా అవినాష్‌గా మారిన శీను ఏండ్లు గడుస్తున్నా... తన చిన్ననాటి స్నేహితురాలు జున్నును మాత్రం మర్చిపోడు. తనకోసం ఎదురుచూస్తూనే ఉంటాడు. అలా ఎదురు చూస్తున్న తరుణంలో అవినాష్ కు కళ్యాణి పరిచయం అవుతుంది. కళ్యాణి, అవినాష్ లు చాలా దగ్గరవుతారు. ఒకర్ని ఒకరు మిస్సయేంతలా దగ్గరైన వాళ్లకు పెళ్లి చేయాలని అవినాష్ తల్లి సరోజని చూస్తుంటుంది. మరి అవినాష్, కల్యాణిలకు పెళ్లయిందా.. లేక.. శీనుకి తన జున్ను దొరికిందా..? ఆమెను ఎలా కనిపెట్టగలిగాడు..? చివరకు ఇద్దరు వాళ్ల డెస్టినీ రీచ్ అయారా.. సోల్ మేట్ ను కలిశారా అన్నదే మిగతా కథ.

 

విశ్లేషణ: 
చిన్నప్పుడు దూరం చేసుకున్న తన స్నేహితురాలి కోసం వెతికే ఓ అబ్బాయి కథే ఈ ‘హలో’. అయితే చాలా సినిమాల్లో చూపించినట్లుగానే ఇదికూడా ప్రత్యేకత లేని లవ్ స్టోరీ కావటంతో అనుకున్నంతగా లేదు. మనసంతా నువ్వే టైప్ లో కథ అనుకున్నా.. ఫోన్ కోసం అఖిల్ చేసిన సాహసాలు అంత అవసరమా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లేలో ఇదేం రొటీన్ స్టోరీరా బాబూ అనిపిస్తూ బోర్ కొట్టిస్తుంది. సెంటిమెంటుతో లాగేద్దామని చూసినా అదీ అంతగా లేదు. ఫస్టాఫ్ అంతా సాదాసీదాగా సాగిన సినిమాలో సెకండాఫ్ అయినా ఆకట్టుకుంటుందనుకుంటే.. అదీ లేదు. రొటీన్ స్టోరీ కావటం అందునా ఏ పదిహేనేళ్ల క్రితమో తీయాల్సిన కథను ఇప్పుడు తీయడం, కొత్తదనం లేకపోవడం, తెలిసిన స్టోరీని మరోసారి చూపించినప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం సరిగాలేదు. దాంతో ఈ జనరేషన్ యూత్ కు మూవీ కనెక్ట్ కాలేకపోయింది. అన్నింటికి మించిన సమస్య అదే. అసలు సినిమాకు ఏదైతే ముఖ్యమో ఆ కథ ఇప్పుడున్న జనరేషన్ కు కనెక్ట్ అవుతుందా కాదా అనే లాజిక్ పక్కాగా మిస్సయ్యారు. ఫోన్ నెంబరు కోసం అఖిల్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ చూస్తే... ఫోన్ కోసం ఇంత అవసరమా అనిపించక మానదు. టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో.. మన వాళ్లను గానీ, దేన్నైనా గాని పట్టుకోవటం కోసం ఇతర సులభమైన పద్ధతులున్నా... దాని కోసం భారీ సాహసాలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మనం సినిమాతో మ్యాజిక్ చేసిన విక్రమ్ కుమార్ ఈ సారి ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు. సీన్స్ అన్నీ రిచ్ టేకింగ్ తో తీసుకున్నా... ఆ కలర్ మూవీకి ప్లస్ కాలేకపోయింది. ఇంటర్వల్ బ్యాంగ్ కూడా ఆసక్తికరంగా లేదు. క్లైమాక్స్ సన్నివేశాలు సాగదీసినా... ఏదో సస్పెన్స్ తో క్లైమాక్స్ ముగుస్తుందనుకుంటే.. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకుండా.. చాలా సినిమాల్లో చూసినట్లే.. రొటీన్ గా హీరో, హీరోయిన్‌ కలుసుకోవటంతో ప్రేక్షకుల్లో ఆ క్యూరియాసిటీ కలిగించలేకపోయారు.

 

అఖిల్ నటన పరంగా తొలి సినిమాతో పోలిస్తే డాన్సులు, ఫైట్స్ బాగానే ఇంప్రూవ్ అయాడు. యాక్షన్ సీన్స్‌ లో అతడి కష్టం తెరపై కనిపిస్తుంది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ అనే ఫీలింగ్ కలిగించలేకపోయింది. కొన్ని చోట్ల ఎమోషన్స్ పలికించడానికి ఇబ్బంది పడింది. రమ్యకృష్ణ, జగపతి బాబు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశాడు. టెక్నికల్‌గా సినిమా విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చిత్రానికి ప్రధాన బలం. పాటలు కూడా మెప్పిస్తాయి. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చే అవకాశం కనిపించట్లేదు. ఈ సినిమాకు అఖిల్ హీరో కాబట్టి భారీగా ఖర్చు పెట్టామని నాగార్జున చెప్పటం చూస్తే బాగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా... కథ ప్రేక్షకులు కనెక్ట్ కాకపోతే దెబ్బ తినాల్సి వస్తుందని ఆలోచించలేదు. అసలు హలో కథ ఈ జనరేషన్ కు కనెక్ట్ అవుతుందా లేదా అనేది ఎందుకు ఆలోచించలేకపోయారో అర్థం కాదు. ఎందుకంటే ఫోన్ కోసం వీరలెవెల్లో ఫైటింగ్ చేసి చివరకు మళ్లీ అదే వయలిన్ వాయిస్తేగానీ తన గర్ల్ ఫ్రెండ్ ను కనిపెట్టలేకపోయాడు. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోలతో ప్రమోషన్ చేయించడం వల్లనే పాజిటివ్ బజ్ క్రియేట్ అయిందని చెప్పాలి.

loader