ఇటీవల గవర్నర్ నరసింహన్ రాష్ట్రపతి విందు అనంతరం  ప్రగతి భవన్ లో పవన్‌ కల్యాణ్‌, కేసీఆర్ మధ్య భేటీ చర్చనీయాంశమైంది. ఇద్దరి భేటీ పలు విమర్శలకు తావిచ్చింది. అవసరం ఏర్పడితే రాజకీయాలు ఎంతకైనా దిగజారుతాయనడానికి ఈ ఇద్దరే నిదర్శనమని దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు.

 

ఇక పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం స్పెషల్ షోను తెలంగాణ సీఎం కేసీఆర్‌, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ల కోసం ఏర్పాటు చేయనున్నట్లు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు స్వయంగా తెలిపారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో త్రివిక్రమ్, నిర్మాత చినబాబు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా సినిమా చూసేందుకు రావాలని మంత్రిని ఆహ్వానించారు. అలాగే సీఎం కేసీఆర్‌ను కూడా సినిమా చూడాల్సిందిగా మరీ మరీ అడిగినట్లు తెలుస్తోంది. ఇక అజ్ఞాతవాసికి ఎక్కువ 'షో'లకు అనుమతినిచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  

 

కేసీఆర్‌ను సినిమాకు ఆహ్వానించామని దర్శక నిర్మాతలు చెబుతున్న నేపథ్యంలో.. ఒకవేళ కేసీఆర్ గనుక సినిమా చూసి పాజిటివ్ గా స్పందిస్తే.. పవన్ కు ఆయనకు మధ్య దోస్తీ కుదిరిపోయిందన్న కామెంట్స్ రావటం ఖాయం. మరి కేసీఆర్ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తారా? లేదా చూడాలి.

 

మరోవైపు ప్రజలను దోచుకోవడానికే ఇలా ప్రభుత్వం దగ్గర అనుమతులు తెచ్చుకుని ఎక్కువ 'షో'లు వేయించుకుంటున్నారని క్రిటిక్ కత్తి మహేష్ లాంటి వాళ్లు విమర్శిస్తున్నారు. గత కొద్దికాలంగా పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ ను టార్గెట్ చేసిన నేపథ్యంలో ఆయన మరింతగా విమర్శల పదును పెంచారు. అసలే ట్రైలర్ కోసం నరాలు తెగేలా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ను కత్తి విసిగిస్తూ కామెంట్లు పెట్టి మరింత వేడి పుట్టిస్తున్నాడు. మరి రాజకీయంగా కామెంట్స్ వచ్చే నేపథ్యంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి. సినిమా చూసి స్పందిస్తే మాత్రం పవన్ ఫ్యాన్స్ కేసీఆర్ కు తెలంగాణలో మద్దతు నిలిచే అవకాశాలుంటాయి కాబట్టి దోస్తీ పెరగటం ఖాయం.