జనవరి పది మరో నాలుగు రోజుల్లో వచ్చేస్తోంది. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ల అజ్ఞాత వాసి సినిమా రిలీజ్ చేయాల్సిన రోజు అదే. అజ్ఞాతవాసికి ఓపక్క కౌంట్ డౌన్ మొదలైంది. ఫ్యాన్స్ తో పాటు అంతా మూవీ కోసం, ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో కాపీరైట్ వివాదం చుట్టుముట్టడంతో దర్శకనిర్మాతలకు ఊపిరాడకుండా వ్యవహారం తయారైందని తెలుస్తోంది.

 

ఫ్రెంచ్ దర్శకుడు జెరోం సల్లే దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్రెంచ్ మూవీ 'లార్గో వించ్' సినిమాకు అజ్ఞాత‌వాసి కాపీ అన్న ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ విడుదల చేసినప్పటి నుంచి ఈ ప్రచారం జోరందుకుంది. అయితే ఇప్పుడు ట్రైలర్ కూడా విడుదలైతే ఆ ప్రచారం మరింత ఊపందుకుంటుందని త్రివిక్రమ్ భయపడుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో సీన్లకు లార్గో వించ్ తో పోలికలు ఉంటే.. కాపీ అన్న ముద్ర పడిపోవడం ఖాయమంటున్నారు.

 

కాపీరైట్ వివాదం మరింత ముదిరితే సినిమా ప్రమాదంలో పడిపోతుందనే భయం వల్లే ట్రైలర్ కట్ చేసి సిద్దంగా ఉంచినా.. విడుదల చేయడానికి మాత్రం త్రివిక్రమ్ ధైర్యం చేయట్లేదని కూడా వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఎప్పుడు ఓకె అంటే అప్పుడు యూట్యూబ్ లో ట్రైలర్ దర్శనమిస్తుందని తెలుస్తోంది.

 

మరోవైపు కాపీ ఆరోపణల నేపథ్యంలో అజ్ఞాతవాసి మేకర్స్ కోర్టుల్లో కెవియట్ తెచ్చుకున్నారని తెలుస్తోంది. దాదాపు 14 కోర్టుల్లో కెవియట్ దాఖలు చేసి రిలీజుకు ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎటొచ్చీ ఒక్కసారి సినిమా రిలీజైతే పవన్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావటం మాత్రం ఖాయం. అందుకే  రిలీజ్ కు ఆటంకాలు రాకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.