పాకిస్తానీ గాయకుడు అద్నన్ సమీకి భారత పాస్ పోర్ట్ ఎందుకంటే..

adnan sami applied indian passport
Highlights

  • భారత దేశ పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్న సింగర్ అద్నన్ సమీ
  • పాకిస్తానీ పౌరుడైన అద్నన్ గత పద్దెనిమిదేళ్లుగా ముంబైలో నివాసం
  • పాకిస్తాన్ అధికారుల వైఖరి వల్లే తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి

ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నన్ సమీ పాకిస్తాన్ నుంచి భారత దేశానికి వచ్చి ముంబైలో సెటిలై 18 సంవత్సరాలు గడిచింది. అయితే తన కెరీర్ లో ఎదుగుదల కోసం ముంబై వచ్చిన అద్నన్ సమీ ఇక్కడే ఎందుకు సెటిలవ్వాలనుకోవడంపై ఇప్పటికీ వివరణలు ఇవ్వాల్సి వస్తోంది.

గత పద్దెనిమిదేళ్లుగా ముంబై నా సొంతూరయిపోయిందని, ఇక్కడే చాలా సంతోషంగా ఉన్నానని అద్నన్ అంటున్నాడు. పద్దెనిమిదేళ్ల సమయం ఒక నగరంతో అనుబంధం ఏర్పడటానికి చాలా ఎక్కువని, ముంబై తనకు కన్న తల్లిలాంటిదని అద్నన్ స్పష్టం చేస్తున్నాడు.

 అయితే భారత్ లో స్థిర పడాలనుకున్న అద్నన్ నిర్ణయాన్ని పాకిస్తాన్ లోని చాలా మంది వ్యతిరేకించడం సహజమే. అయితే పాకిస్తానీయుల వాదనకు భిన్నంగా... అద్నన్ సమీ ప్రపంచమంతా ఒక్కటేనని, సరిహద్దులు మనం గీసుకున్నవేననీ అంటాడు. మనం ఎక్కడ నివసించాలనుకుంటామో అది మన హక్కు అని అద్నన్ స్పష్టం చేసాడు.

 

ఎంతో మంది విదేశాల్లో స్థిరపడ్డ సంఘటనలున్నాయని అద్నన్ వాదిస్తున్నాడు. డాక్టర్లు యూకే, యూఎస్ లాంటి దేశాలకు వెళ్లినప్పుడు తనలాంటి వాళ్లు తమకు నచ్చిన చోట ఉంటే తప్పేంటని, తను దక్షిణాసియా సంగీతానికి కేంద్రం లాంటి ముంబైలో ఉండాలనుకోవడం సరైందేనని అద్నన్ వ్యాఖ్యానిస్తున్నాడు.

 

పాకిస్తాన్ పాస్ పోర్టు నిజానికి రెనువల్ కావాల్సి ఉందని అయితే వివిధ కారణాలతో దాన్ని జాప్యం చేస్తున్నారని, అందుకే భారతీయ పాస్ పోర్ట్ కు అప్లై చేసుకున్నానని అద్నన్ స్పష్టం చేశాడు. పాక్ అధికారుల వైఖరి వల్ల కొంత కాలంపాటు తాను పౌరసత్వం కోల్పోయి బతకాల్సి వచ్చిందని.. అయితే భారత ప్రభుత్వం తనకు పర్మినెంట్ రెసిడెంట్ స్టేటస్ కల్పించిందని అందుకే ఇప్పుడు పాస్ పోర్ట్ కూడా దరఖాస్తు చేసుకున్నానని, అయితే అందుకోసం పాకిస్తాన్ పౌరసత్వం వదులుకోవాల్సి వస్తోందని అద్నన్ తెలిపాడు.

 

తనకు పాకిస్తాన్ ప్రజల పట్ల ప్రేమ ఎంత మాత్రం తగ్గదని, పాక్ ప్రజలు కూడా తనని ఎంతో ప్రేమిస్తున్నారని అద్నన్ అన్నాడు.కేవలం పాక్ అధికారుల వైఖరి వల్లే తను తప్పనిసరి పరిస్థితుల్లో భారత పాస్ పోర్ట్ కు దరఖాస్తు చేసుకున్నానని అద్నన్ సమీ స్పష్టంచేశాడు.

 

సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడైన అద్నన్ గత 30 ఏళ్ల కెరీర్ లో చేసింది తక్కువ పాటలే అయినా.. తనకు సెలెక్టివ్ గా పనిచేయడమే తెలుసని అద్నన్ తెలిపాడు.

 

అయితే... పాకిస్తానీ సంగీతాన్ని ఆస్వాదిస్తానని, కోక్ స్టూడియోపై రొహైల్ హ్యాత్, ఫరీదా ఖానుమ్ ప్రదర్శన చూసి తన కళ్లు చెమ్మగిల్లాయని అద్నన్ భావోద్వేగంతో మాట్లాడాడు.

loader