ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఆమని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటిస్తోంది. అయితే కెరీర్ ఆరభంలో ఆమె ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి ఇప్పుడు ప్రస్తావించింది. దాదాపు రెండేళ్ల పాటు ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. 

''నా ఫోటోలను, నన్ను చూసి బాగానే ఉన్నావని చెప్పి మరుసటి రోజు ఫోన్ చేసి మన గెస్ట్ హౌస్ ఉంది కదా.. అక్కడికి వచ్చేయండి మేకప్ టెస్ట్ చేస్తామని అనేవారు. గెస్ట్ హౌస్ అనగానే నాకు సీన్ అర్ధమయ్యేది. మళ్లీ నాతో పాటు అమ్మని తీసుకురావొద్దని చెప్పేవారు. దీంతో వాళ్లు ఏం ఆశిస్తున్నారో నాకు అర్ధమయ్యేది. ఇదంతా కూడా కొత్త కంపనీల్లోనే ఎక్కువగా జరిగేది. ఆ కంపనీల నుండే నేను కాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎక్కువగా ఎదుర్కొన్నాను'' అంటూ వెల్లడించింది.

నేటి తరం హీరోయిన్లు పెద్ద నిర్మాతల నుండి కూడా వేధింపులు ఎదుర్కొన్నామని చెబుతుంటే.. అమ్మని మాత్రం కేవలం కొత్త కంపనీల్లోనే కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురయ్యాయని ప్రొఫెషనల్ సంస్థలు, అగ్ర దర్శకనిర్మాతల నుండి తనకు ఎలాంటి వేధింపులు ఎదురుకాలేదని స్పష్టం చేసింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఫేస్ చేశానని చెప్పుకొచ్చింది.