Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ:ఆటగదరా శివ

 ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాను థియేటర్ కు వెళ్లి చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఎన్ని రోజులు సినిమా థియేటర్ లో ఉంటుందనేది కూడా సందేహమే

aatagadara siva telugu movie review

నటీనటులు: ఉదయ్  శంకర్, దొడ్డన్న,హైపర్ ఆది తదితరులు 
సంగీతం: వాసుకి వైభవ్
ఛాయాగ్రహణం: లవిత్
నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్ 
దర్శకత్వం: చంద్ర సిద్ధార్థ్ 

'ఆ నలుగురు', 'అందరి బంధువయా' లాంటి క్లాస్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రసిద్ధార్థ 'ఏమో గుర్రం ఎగరావచ్చు' ఫ్లాప్‌ అవ్వడంతో గ్యాప్‌ తీసుకున్నారు. 2014 నుంచి దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన 'ఆటగదరా  శివ' అనే మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా దర్శకుడిగా ఆయనకు పూర్వవైభవాన్ని తీసుకురాగలిగిందో.. లేదో.. సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
బాబ్జీ(ఉదయ్ శంకర్)కి అతడు చేసిన నేరాలకు గాను కోర్టు ఉరిశిక్ష ఖరారు చేస్తుంది. మరో నాలుగు రోజుల్లో ఉరిశిక్ష పడుతుందనే సమయంలో జైలు నుండి తప్పించుకుంటాడు బాబ్జీ. అతడిని పట్టిస్తే పది లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. అలా పారిపోయిన బాబ్జీ తనను ఉరితీయబోయే తలారి జంగయ్య(దొడ్డన్న)తో కలిసి ప్రయాణం చేయాల్సివస్తుంది. ఇంతలో బాబ్జీ వేరొకరికి దొరికే ముందు అతడిని చంపేయాలని పోలీసు అధికారులు నిర్ణయించుకుంటారు. అసలు బాబ్జీ నిజంగానే నేరం చేశాడా..? ఉరిశిక్ష పడ్డ అతడిని పోలీసులు ఎందుకు చంపాలనుకుంటున్నారు..? తలారితో బాబ్జీకు సంబంధం ఏంటి..? చివరికి వీరి జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
ఉరిశిక్ష నుండి తప్పించుకున్న ఖైదీ.. అనుకోకుండా తనను ఉరితీయాల్సిన తలారినే కలుస్తాడు. ఒకరికొకరు తెలియకపోవడంతో ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు. ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన అనుభవాలు ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తం. తాత్విక నేపథ్యంలో సాగే కథాంశమిది. కన్నడంలో విజయవంతమైన రామ రామ రే అనే సినిమా ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మినహాయిస్తే.. కన్నడ సినిమా ఎలా తీశారో తెలుగు వెర్షన్ కూడా అలానే ఉంది. తెలుగులో ఇటువంటి కథతో సినిమాలు రాలేదు. కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ దర్శకుడు ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా సినిమా తీయలేకపోయారు.

బాబ్జీ అనే పాత్ర మంచితనం తెలియజేయడం కోసం రాసుకున్న ట్రాక్ లను సరిగ్గా ఆవిష్కరించలేకపోయారు. మధ్యలో ఆది లవ్ ట్రాక్ ద్వారా కామెడీతో కూడిన ఎమోషన్ ను పండించాలనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు. నిజానికి ఆ ట్రాక్ సీరియస్ గా సాగి ఉంటే ఆసక్తికరంగా ఉండేది. ఏదో కామెడీ చేయించాలి కదా అని జబర్దస్త్ ఆర్టిస్టులందరినీ రంగంలోకి దించినట్లు ఉందే కానీ సినిమాలో నవ్వులు మాత్రం పూయించలేకపోయారు. నిజానికి ఇలాంటి కథలతో మంచి డాక్యుమెంటరీ సినిమాలు చేయొచ్చు. కానీ రెండు గంటల సినిమాగా మాత్రం ప్రేక్షకులు ఈ కథను ఆదరించలేరు. బాబ్జీ క్యారెక్టర్ కు అసలు మాటలే ఉండవు. జంగయ్య పాత్ర కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ లో ఈ రెండు పాత్రల ద్వారా తెరపై మంచి ఎమోషన్ పండింది.

పతాక సన్నివేశాలకు కళ్లు చెమర్చడం ఖాయం. కన్నడలో ఇది హిట్ కథ అయినప్పటికీ తెలుగు వారికి మాత్రం ఈ కాన్సెప్ట్ పెద్దగా ఎక్కదు. నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కాస్త బాగుందనిపిస్తుంది. సినిమాకు ప్రధాన హైలైట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ కథకు తగ్గట్లుగా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. 'సమయానికి వచ్చేది దేవుడు కాదు.. యముడు' అంటూ ట్రైలర్ తో ఆసక్తిని క్రియేట్ చేశారు కానీ ఆ రేంజ్ డైలాగ్స్ సినిమాలో లేవు. కొన్ని డైలాగ్స్ మరీ అర్ధంలేని విధంగా ఉన్నాయి. మొత్తానికి డైరెక్టర్ ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నాడనే విషయం కామన్ ఆడియన్స్ కు అర్ధం కాదు.

జీవిత ప్రయాణంలో మనం అనుకున్నట్లుగా ఏది జరగదు.. ఆ శివుడి ఆడే ఆటే ఈమనిషి జీవితం ఈ కాన్సెప్ట్ కు కొన్ని క్యారెక్టర్లు యాడ్ చేసి సినిమాగా తీశారు. సినిమాలో రెండు, మూడు సార్లు శివుడ్ని తలచుకొని టైటిల్ జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాను థియేటర్ కు వెళ్లి చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. ఎన్ని రోజులు సినిమా థియేటర్ లో ఉంటుందనేది కూడా సందేహమే. కానీ డైరెక్టర్ చేసిన ప్రయత్నాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు. దాన్ని ప్రతిఒక్కరికీ కనెక్ట్ అయ్యే విధంగా తీసి ఉంటే మంచి సినిమా చూశామనే భావన కలిగేది. కానీ ఇప్పుడు మాత్రం తన కథతో ప్రేక్షకులను ఆడుకున్నట్లైంది. 

రేటింగ్: 1.75/5   
 

Follow Us:
Download App:
  • android
  • ios