‘సీతారే జమీన్ పర్’ తర్వాత ‘మహాభారతం’ సినిమా చేస్తానని ఆమిర్ చెప్పారు. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఆయన చివరి సినిమా అవ్వొచ్చు అని కూడా అన్నారు.

రిలీజ్ కి రెడీ అవుతున్న సీతారే జమీన్ పర్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం ‘సీతారే జమీన్ పర్’ (Sitare Zameen Par) విడుదలకు సిద్ధమవుతోంది. జూన్ 20న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమిర్, తాను చాలా ఏళ్లుగా కలలు కంటున్న ‘మహాభారతం’ ప్రాజెక్ట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

అదే నా చివరి చిత్రం కావచ్చు 

“ఇది చిన్నప్పటి నుంచి నా కల. ప్రపంచంలో ఉన్న ప్రతీ భావోద్వేగం, ప్రతి మానవ సంబంధం మహాభారతంలో కనిపిస్తుంది. నేను దాన్ని సినిమా రూపంలో తీయాలనుకుంటున్నాను,” అని చెప్పారు. అయితే, ఆశ్చర్యకరంగా, ఈ ప్రాజెక్ట్ తన కెరీర్‌లో చివరి సినిమా కావొచ్చు అని కూడా పేర్కొన్నారు. “ఇంతటి గొప్ప కథ తర్వాత ఇంకేం చేయాలో నాకు అర్థం కాకపోవచ్చు. పని చేస్తూనే చనిపోవాలని ఉంది. కానీ బహుశా ఇది నా చివరి సినిమా అయి ఉండొచ్చు,” అని వ్యాఖ్యానించారు.

ఆమిర్ ఖాన్ కామెంట్స్ తో షాక్ లో ఫ్యాన్స్ 

ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. "ఇంకా మీరు ఎన్నో గొప్ప సినిమాలు తీయాలి" అని సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆయన గత చిత్రం ‘లాల్ సింగ్ చద్దా' పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు వస్తున్న ‘సీతారే జమీన్ పర్’ మీద భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో జెనీలియా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇది ఆయన గత హిట్ చిత్రం ‘తారే జమీన్ పర్’ కు సీక్వెల్ అని తెలుస్తోంది.

అంతేకాదు, ఆమిర్ ప్రస్తుతం మరో మూడు ప్రాజెక్ట్స్ లో కూడా బిజీగా ఉన్నారు. ‘హ్యాపీ పటేల్’, ‘చార్ దిన్ కీ చాందనీ’, ‘మహాభారతం’తో పాటు జోయా అక్తర్ సినిమాలో కూడా ఆమిర్ నటిస్తున్నారు. కానీ మహాభారతం ఆయనకు ఓ కల మాత్రమే కాదు, జీవిత లక్ష్యంగా మారింది.

నాలుగేళ్లుగా రీసెర్చ్

ఇంటర్నల్ సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ కోసం ఆమిర్ గత నాలుగేళ్లుగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇది సినిమాగా తీస్తారా? లేక వెబ్ సిరీస్‌గా రూపుదిద్దుకుంటుందా అన్నది ఇంకా ఖరారు కాలేదు. భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందించే ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా మారే అవకాశముంది.

ఆమిర్ రిటైర్మెంట్ వ్యాఖ్యలతో అభిమానులు షాక్ లో ఉన్నప్పటికీ , ఆయన మహాభారతం ప్రాజెక్ట్‌పై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.