అనంతపురంలో ఉద్రిక్తత... టిడిపి నాయకుడిపై వైసిపి కార్యకర్తల దాడి
అనంతపురం జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. అక్కడ అధికార వైసిపి నాయకులు, కార్యకర్తలు తమపై దాడులకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష టిడిపి నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాప్తాడు నియోజకవర్గంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడితో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.
కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిడిపి గెలుపు కోసం పనిచేశాడు. దీంతో అతడిపై కక్షగట్టిన ప్రత్యర్థి వైసిపి నాయకులు అదును కోసం ఎదురుచూశారు.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అంతేకాదు రాప్తాడులో కూడా టిడిపి అభ్యర్థి ఓటమిపాలయ్యాడు. దీంతో అధికార బలంతో వైసిపి నాయకుల ప్రోద్బలంతో ఆ పార్టీ కార్యకర్తలు రామాంజనేయులపై దారుణంగా దాడిచేసినట్లు టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
read more ఆ కథేంటో తేల్చుకుందాం రండి: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న సవాల్
ఈ దాడిలో రామాంజనేయులు తలకు తీవ్ర గాయమైంది . అంతేకాకుండా అతడి ఎడమ చేయి రెండు చోట్ల విరిగినట్లు వైద్యులు తెలిపారు. అతడి తల పగిలిపోవడంతో పది కుట్లు వేయడంతో పాటు చేతికి కట్టు కట్టినట్లు డాక్టర్లు తెలిపారు.
ఇప్పటికే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టిడిపి నాయకులపై జరుగుతున్న దాడులు, వేధింపులపై ఉద్యమబాట పట్టారు. 37ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ ఇన్ని వేధింపులు ఎదుర్కోలేదన్నారు. ఇంతమందిపై అక్రమ కేసులు బనాయించి ఆస్తులు ధ్వంసం చేయలేదని చంద్రబాబు వైసిపిపై తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.
అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి కోసమే టిడిపి పాటుబడిందన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం చేశామన్నారు. గతంలో ఎప్పుడూ టిడిపి నాయకులపై, కార్యకర్తలపై ఇన్ని దాడులు, దౌర్జన్యాలు జరగలేదన్నారు. 150రోజుల్లో 622దాడులు-దౌర్జన్యాలకు పాల్పడ్డారని....8మంది ఎమ్మెల్యేలపై, 11మంది మాజీ ఎమ్మెల్యేలపై, 4గురు ఎమ్మెల్సీలపై, రాష్ట్రపార్టీ నేతలు 24మందిపై, మొత్తం 131మందిపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.
read more గంటా బిజెపిలోకా తెలియదు, బాబుకు 240 కిమీ దూరం: బీజేపీ నేత
ఎస్సీ-ఎస్టీ అట్రాసిటి కేసులు బనాయించారని.... సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారన్నారు. భౌతికదాడులకు పాల్పడ్డారు, ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తున్నారని... ఇంత దుర్మార్గ పాలన గతంలో చూడలేదని తెలిపారు.
కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు పరాకాష్టగా పేర్కొన్నారు. కోడెలపై, కుటుంబ సభ్యులపై 19కేసులు పెట్టి, అవమానాలకు గురిచేసి ఆత్మహత్యకు పురికొల్పారని... ఫర్నిచర్ దొంగ ముద్రవేసి 409,411 సెక్షన్లు పెట్టి మానసిక క్షోభకు గురిచేశారన్నారు. ఛలో ఆత్మకూరుకు వెళ్లేందుకు నావద్దకు వచ్చిన అచ్చెన్నాయుడిపై 2చోట్ల కేసులు పెట్టారని తెలిపారు. ఆత్మకూరుకు నన్ను వెళ్లనివ్వకుండా ఇంటి గేట్లకు తాళ్లు కట్టారని మండిపడ్డారు.
ప్రభుత్వ బాధితుల కోసం శిబిరం 10రోజులు నడపడం ఇదే తొలిసారని... ఏదో అన్నాడని కూన రవికుమార్ పై అక్రమ కేసు పెట్టారని తెలిపారు. 40ఏళ్ల క్రితం అంశంపై సోమిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని...అఖిల ప్రియ ఇంటిపై దాడిచేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఆమె భర్తపై తప్పుడు కేసులు, పలమట వెంకట రమణపై, వంశీపై తప్పుడు కేసు బనాయించారని మండిపడ్డారు.
తప్పుడు కేసులు పెట్టి, బెదిరించి, వేధింపులకు గురిచేసి, అవమానాలకు గురిచేసి లొంగదీసుకోవాలని చూడటం నీచ రాజకీయమన్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే దానికి ముందురోజు బాలరాజుతో రాజీనామా చేయిస్తారా...? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లపై మంత్రులు దుర్భాషలాడతారా...? అని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో బిజెపి కార్యకర్తలపై దాడులు చేశారని...ప్రశ్నించేవాళ్లను అణిచేయాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
ప్రభుత్వం మారిన తరువాత కొంత సమయం ఇద్దామని అనుకున్నామని అన్నారు. కానీ అడుగడుగునా అవినీతి, అరాచకాలు, వేధింపులు, విధ్వంసంతో రాష్ట్రం సర్వనాశనం చేస్తుండటాన్ని సహించలేకే ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాని పేర్కొన్నారు. 5నెలల్లో చేసిన తప్పుడు పనుల వల్లే అన్నివర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో రోడ్ల మీదకు వచ్చారని మండిపడ్డారు.