రాజధాని అమరావతిపై ఆయన నిర్ణయమే ఫైనల్...: వైసిపి ఎమ్మెల్యే
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుతం గందరగోళం కొనసాగుతున్నవిషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి రాజధాని నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే అమరావతిలో చంద్రబాబు పర్యటిస్తున్నారని ఆరోపించారు.
గురువారం అనంతపురంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజధాని పేరుతో దోపిడీ చేసిన చంద్రబాబు.. ఇవాళ అమరావతిలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలియజేస్తాననడం హాస్యాస్పదం అన్నారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీ చేసిన చంద్రబాబుకు తన పాపాలు వెంటాడుతున్నాయన్నారు. వాటిపై సమగ్ర విచారణ జరిగితే తాను కటకటాలపాలవుతాడన్న భయం చంద్రబాబులో ఉందని తెలిపారు. ఐదేళ్లలో అసలు అమరావతిలో చంద్రబాబు ఏం అభివృద్ధి చేశాడని ప్రశ్నించారు.
సచివాలయం, హైకోర్టు తాత్కాలికం కాదా? అని అన్నారు. నిజంగా చంద్రబాబు అభివృద్ధి చేసుంటే అతడి కొడుకు లోకేష్ ఎందుకు ఓడిపోతాడన్నారు. రైతుల నుంచి 30 వేల ఎకరాలకు పైగా తీసుకున్నారని, రైతులకు వచ్చిన లే ఔట్లు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు. తీరా ఇప్పుడు అధికారం కోల్పోయాక పర్యటన పేరుతో రాజకీయం చేస్తున్నాడన్నారు.
read more వాటిని కాదని రాజధాని కోసం ఖర్చు చేయమంటారా..?: చంద్రబాబును నిలదీసిన వైసిపి ఎమ్మెల్యే
సింగపూర్ కంపెనీలతో చంద్రబాబుకు లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని, వాస్తవాలు బయటకు వస్తాయనే వాళ్లు వెనక్కు వెళ్లే చేశాడని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చిన దొంగ చంద్రబాబేనని మండిపడ్డారు. రాజధాని విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ముఖ్యమంత్రే ప్రకటన చేస్తారని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అమరావతిలో ఉన్న వాస్తవ పరిస్థితిని మాత్రమే మంత్రులు చెబుతున్నారని వెల్లడించారు. తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. వైఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయని, తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
ప్రజలంతా సీఎం పనితీరును శభాష్ అంటుంటే 40 ఏళ్ల అనుభవమనే చంద్రబాబు మాత్రం జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే విమర్శలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబుకు గడిచిన ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి తెచ్చుకోలేదని అన్నారు.
read more బ్రేకింగ్ న్యూస్... ఏపి ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ రాజీనామా
నా కర్తవ్యాన్ని నెరవేరుస్తా
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తనను గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, తప్పకుండా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. తమకు ఐదేళ్లు అధికారం అప్పగించారని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమల్లోకి తెస్తామన్నారు. గతంలో హామీలు ఇచ్చిన నాయకులు వాటిని విస్మరించారన్నారు.
తాము చేస్తామని చెబితే ప్రజలు విశ్వాసం ఉంచారని తెలిపారు. నగరానికి పీఏబీఆర్ నుంచి నీటి సరఫరా జరుగుతోందంటే అది తాము చేసిందేనన్నారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రయినేజీ మంజూరవుతుందని, డంపింగ్ యార్డును కూడా తరలించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే స్థలం గుర్తించినట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో అవసరం లేని చోట డివైడర్లు ఏర్పాటు చేశారని, ప్రతి పనిలోనూ దోపిడీ చేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక రెండు నెలలకే వర్షం కురిస్తే నగరంలోని రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయన్నారు. దీనిబట్టి వాళ్లు ఏ మాత్రం పనులు చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. కొన్ని రోజులుగా గుంతలన్నీ పూడుస్తున్నామని, అనంతపురంను సుందర నగరంగా తీర్చిదిద్దే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు.
ఎవరు మంచి సలహాలు ఇచ్చినా స్వీకరిస్తానన్నారు. ప్రతీదీ రాజకీయం మంచిది కాదని...అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి సెలవులో వెళితే రాజకీయం చేయడం మంచిది కాదని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి చెప్పారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం సరిగా లేకపోవడంతోనే ఆమె సెలవులో వెళ్లారన్నారు. ప్రతీ దాన్నీ రాజకీయంగా చూడడం తగదన్నారు.
అనంతపురానికి శిల్పారామం తెచ్చింది తామేనని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తాను ఎంపీగా, బీ.నారాయణరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గీతారెడ్డి ఇక్కడకు వచ్చారన్నారు. ఆ సమయంలో జాయింట్ కలెక్టర్, కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్‌గా అనితా రామచంద్రన్ ఉన్నారన్నారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న వాళ్లు అప్పట్లో శిల్పారామం వద్దని చెప్పలేదా? అని ప్రశ్నించారు.
జిల్లాకు హంద్రీనీవా కాలువ ద్వారా 2200 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయని, దాన్ని 10 వేల క్యూసెక్కులకు పెంచనున్నట్లు అనంత తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారన్నారు.
ఇప్పుడున్న కాలువను 6 వేల క్యూసెక్కులకు పెంచి సమాంతర కాలువను మరో 4 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో తీయనున్నట్లు చెప్పారు. ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయన్నారు. 2012 నుంచి ఏటా 30 నుంచి 35 టీఎంసీలు వస్తున్నా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరు ఇవ్వలేదని, జిల్లాను సస్యశ్యామలం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు.