తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్న రాజధాని అమరావతి పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి లేదని పెనమలూరు వైసిపి ఎంఎల్‌ఏ కొలుసుపార్దసారధి అన్నారు. అలాంటి కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకే అలవాటని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అమరావతి పర్యటనపై పార్థసారధి తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భగా మాట్లాడుతూ... నిజానికి చంద్రబాబు సాగిలబడి నమస్కారం చేయాల్సింది శంఖుస్దాపన స్దలానికి కాదని...భూములు ఇచ్చిన రైతులకని అన్నారు.  మాయమాటలతో రాజధాని ప్రాంత రైతులను చంద్రబాబు మోసం చేశారని... ఇలా వారిని మోసం చేసినందుకు క్షమాపణలు చెబుతూ సాగిలబడాలని సూచించారు. 

రాజధాని పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టి చంద్రబాబు భూదోపిడీ చేశారని ఆరోపించారు. రైతులు ఇచ్చిన భూములతో తన వారికి దోచిపెట్టారని...ఇవన్నీ కూడా చంద్రబాబు చేసిన పాపాలేనని అన్నారు. లక్షకోట్లను పెట్టి రాజధాని నిర్మిస్తానని చెప్పిని పెద్దమనిషి కేవలం సెట్టింగ్‌లు, బాహుబలి గ్రాఫిక్స్‌ చూపడం తప్పితే ఇంకేమీ చేయలేదని విమర్శించారు. 

read more  టిడిపి మాడి మసి అవుతుంది... చంద్రబాబును అప్పుడే హెచ్చరించా: డీఎల్

రాజధాని నిర్మాణంపై కేవలం ఐదువేల కోట్లు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. అక్కడ నిర్మించినవన్నీ తాత్కాలిక నిర్మాణాలేనని... శాశ్వత నిర్మాణాలకు దిక్కూ మొక్కూ లేదన్నారు.

అమరావతిలో పర్యటిస్తున్న చంద్రబాబు పై రాళ్లు,చెప్పులు వేశారని టివిలలో చూపిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్రమోది గతంలో రాజధాని శంఖుస్దాపనకు వస్తే అక్కడి స్దానిక దళిత ఎంఎల్‌ఏను కూర్చోబెట్టకుండా కార్యక్రమం నిర్వహించాని అన్నారు. అసైన్డ్‌ భూముల విషయంలో దళితులను నిలువునా మోసం చేశారని ఆరోపించారు.

దళితుల దగ్గర భూములు చౌకగా అమ్మించి తమవాళ్లు కొన్న తర్వాత వాటిని పూలింగ్‌ కు తీసుకున్నారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. ఆయనకు ఎన్నికల హామీలంటే నీటి బుడగలాంటివని... మేనిఫెస్టో అంటే చిత్తుకాగితం లాంటిదన్నారు. కాని జగన్‌ మోహన్‌ రెడ్డి మనస్తత్వం అలాంటిది కాదని అన్నారు. మేనిఫెస్టో ను పవిత్రంగా భావించే సీఎం ఎన్నికల హామీలన్నింటిని అమలు చేస్తున్నారని తెలిపారు.

read more  కడపలో మొరిగిన పిచ్చికుక్క ఇప్పుడు అమరావతికి వచ్చింది...: కొడాలి నాని

రాష్ట్రంలో ఎన్నికల హామీలను తుంగలోతొక్కి పేదవారి కోసం చూడకుండా రాజధానికోసం ఖర్చు చేయాలా?  అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తుందని... రాయలసీమ, ఉత్తరాంధ్ర,  ఆంధ్రా ఇలా అన్నింటికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజా రాజధానిని నిర్మిస్తామన్నారు. నిర్మాణాలన్నింటిని పూర్తి చేయాలని జగన్‌ ఇప్పటికే ఆదేశించినట్లు గుర్తుచేశారు. 

చంద్రబాబునాయుడు పర్యటన చూసి భయపడుతున్నట్లుగా లోకేష్‌ మాట్లాడుతున్నారని...ఇలి డ్రామాలు ఆడటంలో వీరు దిట్టలని అన్నారు.  ఎన్టీఆర్‌ కు సినిమాలలో నటించడం వల్ల పద్మవిభూషణ్‌ వంటి బిరుదులు వచ్చాయి  కానీ చంద్రబాబు అంతకంటే బ్రహ్మాండమైన నటుడని ఎద్దేవా చేశారు. 

మొన్న ఇసుక గురించి ప్రభుత్వం అన్ని నిర్ణయాలు తీసుకున్నతర్వాత ఇసుక దీక్ష చేశాడని... నేడు రాజధాని గురించి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు రాజధానిలో పర్యటన చేస్తున్నాడని అన్నారు. రాజధాని అంటే ప్రజారాజధానిగా ఉండాలి కానీపెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, విదేశీసంస్దలకు అడ్డగా మారకూడదన్నారు. 

ప్రజలందరితో సంబంధించిన ప్రజారాజధానిని తాము నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.  అన్నపూర్ణలాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశాడన్నాఆయనలా  తాము కుట్రలు,దౌర్జన్యపూరిత రాజకీయాలు చేయడంలేదన్నారు. రాజధాని రైతులకు కౌలు చెల్లించిన ఘనత జగన్‌ గారికే దక్కుతుందని పార్థసారధి పేర్కొన్నారు.