విశాఖపట్నం: తమ ప్రభుత్వం ఆరునెలల్లో గొప్ప పాలన సాగించిందని మంత్రి అవంతి  శ్రీనివాస్ అబద్దాలను ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆరోపించారు. ఆయనకు దమ్ముంటే ఈ ఆరునెలల వైసీపీ పాలనపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.

జగన్ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు రద్దు చేయటం, ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవటం తప్ప రాష్ట్రంలో జరిగిన అభివృద్ది ఏంటో చెప్పగలరా?  అంటూ ప్రశ్నించారు. మంత్రి అవంతి ఓ అబద్దాల భవంతి అంటూ ఎద్దేవా చేశారు. 

అవంతి నోటి నుంచి అవాస్తవాలు, అసత్యాలు తప్ప నిజాలు రావన్నారు. ఒలింపిక్‌ గేమ్స్‌కి నాన్‌ ఒలంపిక్‌ గేమ్స్‌కి తేడా తెలియని ఆయన క్రీడా శాఖ మంత్రిగా కాకుండా అబద్దాల మంత్రిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు.

read more అమరావతి స్మశానమైతే మీరు రాక్షసులా...?:మంత్రులకు కళావెంకటరావు చురకలు

అయ్యప్పమాలలో ఉండి కూడా అవంతి అసత్యాలు మాట్లాడుతూ అయ్యప్ప మాలను అపహాస్యం చేశారని అన్నారు.  టీడీపీ హయాంలో వచ్చిన అవార్డులను  తీసుకోవటంలో ఉన్న శ్రద్ద ఆయనకు పరిపాలనపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంత్రిగా పరిపాలనలో ఆయన పూర్తిగా విఫలమయ్యారని...3 రోజుల్లో తీయాల్సిన  బోటును 38 రోజుల్లో వెలికి తీయడమే ఆయన పనితీరు ఎలాంటిదో తెలియజేస్తుందన్నారు. బోటు వెలికితీయటంలో దర్మాడి సత్యానికి ఉన్న చిత్తశుద్ది కూడా పర్యాటకశాఖ మంత్రిగా అవంతికి లేకపోవటం బాధాకరమని విమర్శించారు. 

read more  జగన్ ఆరు నెలల పాలన... కొందరికి మోదం, మరికొందరికి ఖేదం: సిపిఐ రామకృష్ణ

ఈ ఆరు నెలలుగా అవంతి క్రీడాశాఖ, పర్యాటక శాఖను గాలికొదిలేసి అబద్దాలు, అవాస్తవాలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీశారన్నారు.  ఇప్పటికైనా ఆయన  తీరు మార్చుకుని  పాలనపై దృష్టి సారించాలని సత్యనారాయణరాజు సూచించారు.