అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఆరు నెలలు పూర్తయింది. ఈ సందర్బంగా తాము అతి తక్కువ కాలంలోనే అద్భుతమైన పరిపాలన సాగించామని వైసిపి నాయకులు అంటుంటే... ఈ ఆరునెలలూ అరాచక పాలన సాగిందని ప్రతిపక్ష టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా జగన్ ఆరునెలల పాలనపై స్పందిస్తూ వైసిపి, టిడిపి రెండింటి వాదనతో ఏకీభవించారు.

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి 6 నెలల పాలన మిశ్రమ రీతిలో సాగిందని రామకృష్ణ అన్నారు. ఈ 6 నెలలు కొందరికి మోదంగా, మరికొందరికి ఖేదంగా గడిచిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన నవరత్నాల హామీల అమలు పూర్తిగా కాకపోయినా కొంత మేరకు జరిగాయన్నారు. అందుకోసం ప్రభుత్వం, పాలకులు కృషి చేశారని అభిప్రాయపడ్డారు.

సీఎం జగన్ తన మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం పాటించారని అన్నారు. అధికారాన్ని చేపట్టన వెంటనే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లూ అంటూ కొత్త ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగ యువతకు భవిష్యత్  పై భరోసా కల్పించారన్నారు. 

read more  వాతావరణ సమాచారం... ఏపికి పొంచివున్న భారీ వర్షం ముప్పు

అయితే మరోవైపు ప్రభుత్వ చర్యలతో ఇప్పటికే ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులలో అభద్రతాభావం నెలకొందన్నారు. ఇప్పటికే కొంతమంది ఉద్యోగాలు కోల్పోయినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని  గుర్తుచేశారు. 

ఇక ఇసుక పాలసీ అంటూ దాదాపు ఐదు నెలలపాటు ఇసుక సరఫరా ఆపివేయడంతో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని అన్నారు. దీంతో కార్మికుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో పాటు రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై భారం పడిందని ఆరోపించారు.

గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్నా కాంటీన్ల మూసివేతతో నిరుపేదలు, దినసరి కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికార అండతో  వైసిపి ప్రతిపక్ష పార్టీలను ఖాతరు చేయడంలేదన్నారు.

read more  చంద్రబాబు వాహనంపై దాడి కేసు... సిట్ ఏర్పాటు

ప్రస్తుత కేబినెట్ లోని మంత్రులకు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండాపోయిందన్నారు.  నిర్ణయాధికారం మొత్తం సీఎం జగన్ వద్దే వుందని... మొత్తంగా ఏకపక్ష మరీ చెప్పాలంటే ఏకవ్యక్తి పాలన సాగుతోందన్నారు. ఇలా జగన్మోహన రెడ్డి ఆరు నెలల పాలన ప్రజలకు మిశ్రమ ఫలితాలనే మిగిల్చిందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.