శ్రీకాకుళం: ఆంధ్ర ప్రదేశ్ లో గత ఆరునెలల పాలన జగన్మోహన్ రెడ్డి పాలన పిచ్చి తుగ్లక్ పాలనను తలపిస్తోందని టీడిపి రాష్ట్ర అధ్యక్షులు కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణ తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు వైసీపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

కేవలం వైసీపి ప్రభుత్వ ఆరు నెలల పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం విషయంలో కుంటుపడిందని... అమరావతి స్మశానం అయితే మీరు అక్కడ పరిపాలించే రాక్షసులా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని... ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు సమీపిస్తుండడంతో మరోసారి ప్రజలను మోసం చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు.

read more  జగన్ ఆరు నెలల పాలన... కొందరికి మోదం, మరికొందరికి ఖేదం: సిపిఐ రామకృష్ణ

నిరుద్యోగ భృతిని ఆపి ఆరు లక్షల మంది నిరుద్యోగ యువత పొట్టను కొట్టారని ఆరోపించారు. ఇక రివర్స్ టెండరింగ్ లు, ఇరిగేషన్ పనులు రద్దు వంటి వాటివల్ల రాష్ట్రవ్యాప్తంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయని పేర్కొన్నారు. అంతేకాకుండా పంచాయితీ, ఆర్అండ్‌బి రోడ్లు కూడా ఆగిపోయాయని.. ప్రపంచ బ్యాంకులు కూడా పెట్టుబడి ఇచ్చే పరిస్థితులు లేవన్నారు. 

ఆటో డ్రైవర్లకు 10 వేలు రూపాయలు ఇచ్చి ఫైన్ల రూపంలో ఇరవై వేలు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లకు, మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలు, పంచాయతీ కార్యాలయాలకు తమ పార్టీ రంగులు వేయడంకోసం ఏకంగా రూ.1,400 కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారని ఆరోపించారు.

read more  చంద్రబాబు వాహనంపై దాడి కేసు... సిట్ ఏర్పాటు

ఈ ఆరు మాసాల పరిపాలనలో విధ్వంసం, వినాశనం, కక్ష సాధింపు చర్యలు, తిరగబడితే అక్రమ కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వంటివే సాగాయన్నారు. వైసిపి పాలనలో రాజకీయ టెర్రరిజం కొనసాగుతుందంటూ కళావెంకట్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.