కర్నూల్:మద్యం మహమ్మారికి బానిసై మత్తులో జోగుతూ కన్న తల్లిపైనే కొడుకు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఇలా తన కడుపునపుట్టిన వాడే తనపై దాడి చేయడాన్నితట్టుకోలేక మనస్థాపానికి గురైన ఆ తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మానవత్వానికి మచ్చతెచ్చే ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. 

 వివరాల్లోకి వెళ్తే కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామంలో నివాసం ఉంటున్న ఓబులమ్మ కు ఒక్కగానొక్క ఒక్క కొడుకు  మద్దిలేటి. అతను గతంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ భార్యా, పిల్లలతో పాటు వృద్దాప్యంలో వున్న తల్లికి అండగా ఉంటూ కుటుంబాన్ని పోషించే వాడు. కానీ గత కొన్ని నెలలుగా అతడు పూర్తిగా మద్యానికి బానిసై వ్యవసాయం చేయడం మానేశాడు. 

read more పిచ్చివాడు అన్నారని... కన్న తల్లిదండ్రులనే...

అతడు పొలం పనులు చేయకుండా కట్టుకున్న భార్యను, ముసలితనంలో వున్న కన్న తల్లిని కూలి పనులకు పంపిస్తున్నాడు. వారు కూలి పనులు చేసి సంపాదించిన సొమ్ముతో మద్యం తాగుతూ నిత్యం ఇంట్లో గొడవలకు కారణమవుతున్నాడు.

ఈ క్రమంలోనే నిన్న(మంగళవారం) మరోసారి నానాహంగామా సృష్టించాడు. మద్యం తాగేందుకు తల్లిని, భార్యను డబ్బులు అడగగా తమ వద్ద లేవని చెప్పడంతో ఆవేశానికి లోనైన అతడు తల్లి ఓబులమ్మ పై దాడికి పాల్పడ్డాడు. కన్న కొడుకే ఇలా తనపై దాడి చేయడం జీర్ణించుకోలేక ఓబులమ్మ ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

"

అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓబులమ్మను  గమనించిన కోడలు మరియు స్థానికులుచికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

read more  పోలీసుల అతి తెలివి... నలుగురు చిన్నారులపై వరకట్నం కేసు

ప్రస్తుతం ఓబులమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తూ కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని...అయితే విష ప్రభావం ఎక్కువగా వుండటంతో పరిస్థితి గురించి చెప్పలేకపోతున్నామని అన్నారు.