పోలీసుల అతి తెలివితో... నలుగురు  చిన్నారులపై వరకట్నం కేసులు పెట్టారు. కాగా... తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని ఆ నలుగురు చిన్నారులు తమ పెద్దలతో కలిసి కోర్టును ఆశ్రయించారు. ఈ సంఘటన గుంటూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే....గుంటూరు పట్టణ మహిళా పోలీస్ స్టేషన్ లో నలుగురు చిన్నారులపై వరకట్న కేసు నమోదైంది. పోలీసులు యాంత్రికంగా వ్యవహరించి, నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని ఆ నలుగురు చిన్నారులు తమ పెద్దలతో కలిసి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరిగే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా  చంద్రాపురానికి చెందిన పి. బిందు కి 2018లో ఆదరణ కుమార్ తో వివాహమైంది. భర్త, అత్తమామలు, ఆడపడుచులు, వారి భర్తపు అదనపు కట్నం  కోసం వేధిస్తున్నారని ఈ ఏడాది సెప్టెంబర్ 26న గుంటూరు పట్టణ మహిళా పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేశారు.

పోలీసులు వారిపై వరకట్న వేధింపులు, భారత శిక్షాస్మృతి సెక్షన్ 498ఏ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో 6, 9, 11ఏళ్ల వయసుగల ఆడపడుచుల కుమారులు, కుమార్తెలు నలుగురిని నిందితులుగా పేర్కొనడం గమనార్హం.

దాంతో తమపై కేసు కొట్టేయాలని చిన్నారులతోపాటు ఇతర నిందితులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును న్యాయస్థానం పరిశీలించి తీర్పు ఇవ్వనుంది.