కొడుకు అనారోగ్యంతో బాధపడటం చూసి అతని తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు.  మానసిక పరిస్థితి బాగోలేని కన్నకొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలనుకున్నారు. అదే వారి పాలిట మృత్యు శాపంగా మారింది.  తనను పిచ్చివాడు అన్నారని... కన్న తల్లిదండ్రులను  అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్దకు చెందిన జాలపర్తి నాగేశ్వరరావు(55), మార్తమ్మ(48) చిన్నకుమారుడు రమేష్‌ మానసిక పరిస్థితి సరిగా లేక విచిత్రంగా ప్రవర్తించేవాడు. అతనికి వైద్యం చేయించడంతో నయమైంది. అనంతరం చాగల్లు మండలం మలకపల్లికి చెందిన ఓ యువతితో వివాహం జరిపించారు. 

AlsoRead చిన్నారులపై వరకట్నం కేసు..

వివాహమైన 3 నెలల తర్వాత మళ్లీ డిప్రషన్‌కు లోనై భార్యను హింసించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. రెండు రోజులుగా రమేష్‌ పరిస్థితి దారుణంగా తయారైంది. కొడుకు పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. అతడిని ఆస్పత్రికి తీసుకువెళ్లాలని నిర్ణయించి.. వేరే ఊళ్లలో ఉంటున్న పెద్దకొడుకు, కుమార్తెలకు సోమవారం ఫోన్‌ చేసి రావాలని కోరారు.
 
ఈ విషయం తెలిసి తల్లిదండ్రులను చంపుతానని రమేష్‌ బెదిరించాడు. ఈ నేపథ్యంలో ఆ రాత్రి నాగేశ్వరరావు, మార్తమ్మ.. ఇంట్లో గాఢనిద్రలో ఉండగా.. రమేష్‌ ఇనుప రాడ్డుతో వారి తలలపై మోది అత్యంత దారుణంగా హతమార్చాడు. 

ఇంతలో పెద్దకొడుకు సూర్యచంద్రరావు, అల్లుడు నేకూరి ప్రసాద్‌, కుమార్తె రాజేశ్వరి మంగళవారం ఉదయం రమేష్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లేందుకు ఆ ఇంటికి వచ్చారు. ఇంట్లో నాగేశ్వరరావు, మార్తమ్మ విగతజీవులుగా పడి ఉండడం చూసి హతాశులయ్యారు. వారిని చూసిన రమేష్‌ అక్కడి నుంచి పరుగులంకించుకున్నాడు. పోలీసులు సాయంత్రం అతడిని అదుపులోకి తీసుకున్నారు.