కర్నూలు: జిల్లాలోని అవుకు రిజర్వాయర్ వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. తెల్లవారుజామున అధికవేగంతో వెళుతున్న బస్సు ఓ  బైక్ నుమ తప్పించబోయి అదుపుతప్పింది. ప్రమాద సమయంలో బస్సులో వున్న ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ తో సహా 18 మంది ఉన్నారు. ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఇంతకూ ఏం జరిగిందంటే...అవుకు రిజర్వాయర్ మలుపు వద్ద  సడన్ గా కనిపించిన బైక్ కు తప్పించడానికి బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన వున్న వరి పొలాల్లోకి దూసుకెళ్లింది. 

ఈ ప్రమాద సమయంలో రోడ్డుపై మరే ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుండి బస్సు సిబ్బంది, ప్రయాణిలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

జేసీ బ్రదర్స్ కు జగన్ సర్కార్ షాక్: దివాకర్ ట్రావెల్స్ సీజ్ ...

 18 మంది ప్రయాణికులతో బుధవారం రాత్రి దివాకర్ ట్రావెల్స్ బస్సు విజయవాడ నుండి బయలుదేరింది. ఇది అనంతపురం కు ఆరున్నరకు చేరుకోవాల్సి ఉంది. తెల్లవారుజామున వర్షం పడుతుండటంతో అవుకు రిజర్వాయర్ దగ్గరకు రాగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

బస్సు వరి పొలాల్లోకి దూసుకెళ్లినా బోల్తాపడకుండా వుంది. దీంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు.  దీంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా మరోబస్సును ఏర్పాటుచేసిన ట్రావెల్స్ యాజమాన్యం గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చింది.

ప్రమాదానికి గురయిన బస్సు మాజీ ఎంపీ, ప్రస్తుత టిడిపి నాయకులు జేసి దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్స్ ది. ఇటీవలే ఈ దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 8 బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగి కనీసం 24 గంటలయినా గడవకముందే ఈ బస్సు ప్రమాదం జరిగింది.