Asianet News TeluguAsianet News Telugu

ఏ1,ఏ2లు నోటికొచ్చినట్లు...సుప్రీంకు కులాలు అంటగడతారా..?: దేవినేని ఉమ ఆగ్రహం

 సుప్రీం కోర్టు తీర్పు తర్వాతైనా ముఖ్యమంత్రి జగన్, మంత్రులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెబుతారో లేదో సమాధానం చెప్పాలని దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

Devineni Uma sensational comments on AP CM YS Jagan
Author
Vijayawada, First Published Mar 18, 2020, 7:39 PM IST

విజయవాడ: అహంభావంతో రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతుంటే స్పీకర్ సహా మంత్రులంతా తగదునమ్మా అంటూ ఆయనకు వత్తాసు పలుకుతూ కులాలను కించపరిచేలా ఇష్టారాజ్యంగా మాట్లాడారని...వారందరికీ సుప్రీం తీర్పు చెంపపెట్టులాంటిదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. 

బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాతైనా ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కి, ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెబుతారో లేదో... సమాధానం చెప్పాలన్నారు. కోర్టు తీర్పు వచ్చాక కూడా ఒక మంత్రి ఎన్నికల కమిషనర్ ని దుర్భాషలాడాడని... ఎవరో దమ్మాలపాటి శ్రీనివాస్ రాసిస్తే టీడీపీవారు చదువుతున్నారంటూ నోరుపారేసుకున్నాడన్నారు. 

అసలు రాష్ట్రానికి ఆరోగ్యశాఖా మంత్రి ఉన్నాడా అనే సందేహం అందరిలోనూ కలుగుతోందని... పక్కరాష్ట్రంలో మంత్రులు కరోనా కట్టడికి ఏవిధమైన చర్యలు తీసుకున్నారో వెల్లడిస్తుంటే ఈ రాష్ట్రంలో మాత్రం అవేవీలేవన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ కరోనా ప్రభావంపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్షిస్తుంటే 25మంది మంత్రులు, ఉపముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో తెలియడంలేదన్నారు. 

కరోనావైరస్ ప్రపంచాన్నివణికిస్తుంటే ముఖ్యమంత్రిగానీ, ఆరోగ్యశాఖ మంత్రిగానీ ప్రజల ఆరోగ్యంపై ఒక్క సమీక్ష కూడా చేయలేదన్నారు. విదేశాలనుంచి 250 మంది విద్యార్థులు విశాఖకు వస్తున్నారని, వారందరి ఆరోగ్యపరిస్థితిని గురించి తెలుసుకునే బాధ్యత విజయసాయి తీసుకున్నాడో.. అవంతి శ్రీనివాస్ తీసుకున్నాడో సమాధానం చెప్పాలన్నారు. 

మే-31 నాటికి ఉద్యోగులంతా విశాఖకు తరిలివెళ్లేలా వారినుంచి ముఖ్యమంత్రి రిప్రజంటేషన్లు తీసుకుంటున్నాడని, 53 మంది రైతులు చనిపోయినా, 94 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా పట్టించుకోకుండా రాజధానికి తరలించడానికే జగన్ ఆలోచనలు చేయడం దుర్మార్గమని దేవినేని మండిపడ్డారు. 

ప్రపంచమంతా కరోనా ప్రభావంతో విలవిలలాడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం తనకేమి పట్టనట్లుగా తాడేపల్లి రాజప్రసాదంలో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడన్నారు. కరోనా కట్టడికి రాష్ట్రంలో ఏవిధమైన చర్యలు తీసుకున్నారో.. వైరస్ ప్రభావం ఎంతవరకు ఉందో... ఎంతమంది దాని బారిన పడ్డారు..రాష్ట్రంలో ఎన్ని ఆసుపత్రుల్లో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టారు.. ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి దారుణంగా వ్యవహరిస్తున్నాడన్నారు. 

రాబోయే  30-40 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచమంతా కరోనా గురించి చర్చించుకుంటుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం తన ఇగోను వదిలిపెట్టడంలేదన్నారు. ఒక్కజిల్లాలో ఒక్క మంత్రికూడా కరోనాపై సమీక్ష చేయలేదని, రాష్రప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఏవిధమైన జాగ్రత్తలు తీసుకుందో స్పష్టంచేయాలన్నారు. నెల్లూరుజిల్లాలో కరోనా కేసులు గుర్తించారని... వాటి వివరాలతోపాటు కాకినాడలో వైరస్ ప్రభావమున్న వ్యక్తికి చేసిన పరీక్షల వివరాలు బయటకురాలేదన్నారు. 

read more  ఓవైపు కరోనా... మరోవైపు ప్రకృతి విపత్తు: ఉత్తరాంధ్రకు పొంచివున్న ప్రమాదం

10నెలల తరువాత విలేకరుల సమావేశం పెట్టి తాను తిట్టాలనుకున్నది తిట్టేసి వెళ్లిపోయాడేగానీ విలేకరులు అడిగే ప్రశ్నలకు, రాష్ట్రంలో కరోనా ప్రభావంపై తీసుకున్న చర్యల వివరాలను గానీ ముఖ్యమంత్రి ఎందుకు వెల్లడించలేదన్నారు. ఇట్ కమ్స్.. ఇట్ గోస్...దిసీజ్ నిరంతర ప్రక్రియ అంటూ పారాసిట్మాల్ వేసుకొని, బ్లీచింగ్ పౌడర్ కొట్టుకుంటే చాలని  చెప్పాడన్నారు.  

సుప్రీంతీర్పుపై కూడా ముఖ్యమంత్రి కులాలు ఆపాదిస్తాడేమోనని దేవినేని అనుమానం వ్యక్తంచేశాడు. తీర్పు తరువాత కూడా ముఖ్యమంత్రి కరోనా గురించి ఎందుకు మాట్లాడటంలేదని, తీసుకున్న చర్యల గురించిన వివరాలను ఎందుకు బహిర్గతం చేయడంలేదన్నారు. తన పిల్లలను తీసుకొచ్చి  జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంచుకుంటే, రాష్ట్రంలోని మిగతా పిల్లల సంగతేంటని దేవినేని ప్రశ్నించారు. 

ఆరోగ్యశాఖ రాష్ట్రకార్యదర్శిగానీ, సీ.ఎస్ గానీ కరోనా ప్రభావంపై ఒక్కరోజైనా సంబంధిత అధికారులతో ఎందుకు సమీక్ష చేయలేదన్నారు. ప్రభుత్వానికి బుద్ది,జ్ఞానం ఉంటే ఇప్పటికే దీనిపై హైలెవల్ కమిటీ వేసి ఉండేదని, అదేమీ చేయకుండా ప్రతిపక్షంపై, మీడియాపై ఎదురుదాడిచేస్తూ తప్పించుకుంటోందన్నారు. రాష్ట్రం నుంచి అనేకమంది తమతమ పనులకోసం పక్కరాష్ట్రాలకు వెళ్లివస్తుంటారని, వారందరి ఆరోగ్యస్థితిపై ప్రభుత్వం ఏవిధమైన చర్యలుతీసుకుందో, ఎందరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిందో సమాధానం చెప్పాలన్నారు. 

కేంద్రప్రభుత్వం దేశ సరిహద్దులన్నీ మూసేసిందని, కరోనా కట్టడికి ప్రధానమంత్రి పక్కదేశాలతో చర్చలు జరుపుతున్నారని కానీ ముఖ్యమంత్రి మాత్రం ఇవేమీపట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాడన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సుప్రీంకోర్టు తీర్పుతో తగిలిన షాక్ నుంచి తేరుకున్నట్లు లేరన్నారు. 

రాజ్యాంగం, రాజ్యాంగసంస్థలు, వాటి బాధ్యతల గురించి తెలిసినవారెవరైనా ఎన్నికల వాయిదాను స్వాగతిస్తారని, ఎన్నికలు పెట్టేసి తమ పబ్బం గడుపుకోవాలనుకునేవారు మాత్రమే తీర్పుని వ్యతిరేకిస్తారని ఉమా ఎద్దేవాచేశారు. మార్చి 29కల్లా ఎన్నికలు పెట్టేసి ప్రజల ఓట్లన్నీ గుద్దేసుకోవాలి... రెండురోజుల్లో శాసనసభలో జమాఖర్చులుచూపించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి... ఏప్రిల్ నాటికి విశాఖపట్నంలోని నేవీ గెస్ట్ హౌస్ కి వెళ్లాలన్న తాపత్రయంతప్ప ప్రజల ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రికి పట్టడంలేదన్నారు. 

కోర్టులచుట్టూ తిరిగేవ్యక్తి, కండీషన్ బెయిల్ పై బయట తిరిగేవ్యక్తి, సీబీఐ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఏ1, ఏ2లు రాజ్యాంగబద్ధ సంస్థలకు చెందిన వ్యక్తులగురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం దారుణమన్నారు. అటువంటి వారికా 150 సీట్లు ఇచ్చిందని ప్రజలంతా బాధపడుతున్నారని... వారి స్వార్థప్రయోజనాలకోసం రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడుతున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

read more   కరోనాపై అమెరికా అధ్యక్షుడు అలా...సీఎం జగన్ ఇలా: కళా వెంకట్రావు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5కోట్ల మందికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ పై ఉందని, కరోనా కట్టడికి రాష్ట్రంలో ఏం చర్యలు తీసుకున్నారో ఆయనగానీ, రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రిగానీ వెల్లడించాలని దేవినేని డిమాండ్ చేశారు. ఎంతసేపూ తనకు 150 సీట్లు వచ్చాయని చంకలు గుద్దుకోవడం తప్ప  ప్రజల గురించి, వారి ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. 

మార్చి 6వ తేదీన చీఫ్ సెక్రటరీ (సీఎస్) బయోమెట్రిక్ వాడకంపై ఇచ్చిన ఆదేశాల్లో కరోనా జాగ్రత్తలు ప్రస్తావించారని, అవే అంశాలపై ముఖ్యమంత్రితో, ప్రజలతో ఆమే ఎందుకు చర్చించలేదని దేవినేని నిలదీశారు. ఒకవైపు తనకు తానే ఆదేశాలు ఇస్తూ, మరోవైపు రాష్ట్రంలో కరోనా ప్రభావంలేదని, ఎన్నికలు జరపాలని ఆమె ఎన్నికల కమిషనర్ కి ఎలా లేఖ రాసిందన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆరోగ్యమంత్రి, తక్షణమే కరోనాపై సమీక్ష జరిపి ప్రజలముందుకు వచ్చి మాట్లాడాలని దేవినేని డిమాండ్ చేశారు.      

Follow Us:
Download App:
  • android
  • ios