అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలతో పాటు ఇతర ఉపాధి హామీ పనులు తక్షణం ప్రారంభించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. అన్ని పనులకు ఈనెల 15 నాటికి పరిపాలనా అనుమతులు, 18వ తేదీలోగా సాంకేతిక అనుమతులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల   21 నాటికి గ్రౌండ్ లో పెగ్ మార్కింగ్ ఖచ్చితంగా జరగాలన్నారు. డిసెంబర్‌ 31 నాటికి ఎఫ్‌టిఓ అప్ లోడ్ జరగాలన్నారు. 

గ్రామాల్లో అత్యంత ప్రాధాన్యతా క్రమంగా అయిదు పనులను చేపట్టాలన్నారు. మొదటి దశలో గుర్తించిన గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం చేపట్టాలన్నారు. ఆ తర్వాత ప్రాధాన్యతా క్రమంలో సిసి, డ్రైనేజీలు  తీసుకోవాలన్నారు. ఉగాది నాటికి అందించే ఇళ్ళ స్థలాలకు సంబంధించి మెరక పనులు చేపట్టాలన్నారు. 

read more  రష్యా అమ్మాయిని చేసుకున్నావు.. ఇద్దరు పిల్లల్ని కన్నావు.. వారి కులం ఎంటో చెప్పు: వైసిపి ఎమ్మెల్యే

మనబడి నాడు-నేడు కింద గుర్తించిన పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్లక్ష్యానికి గురైన గ్రామాల్లో చేపట్టాల్సిన సిసి రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  జిల్లాల్లో ఉపాది హామీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. పనుల విషయంలో నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. నరేగా లో భాగంగా నాడు-నేడు స్కూళ్లకు ప్రహరీ నిర్మాణాలకు నిధులను కేటాయిస్తున్నామన్నారు.

ఆర్‌డబ్ల్యుఎస్‌ కింద వున్న వాటర్‌ హెడ్ ట్యాంక్ లకు రంగులు వేయాలని సూచించారు.  గ్రామీణ ప్రాంతాల్లో సిసి డ్రైన్ లు పూడిపోకుండా కవరింగ్ పనులు కూడా చేపట్టాలన్నారు. 
సక్రమంగా పనులు చేసే కాంట్రాక్టర్ లకు వెంటనే బిల్లుల చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లేకుండా చూస్తామన్నారు. 

ప్రతి నియోజకవర్గంకు రూ.15 కోట్లు ఇప్పటికే కేటాయించామని...ఈ నిధుల నుంచి జరిగిన పనులకు వెంటనే మూడు విడతల్లో బిల్లులు చెల్లించాలన్నారు. ఇసుక పాలసీలో భాగంగా చెక్ పోస్ట్ ల విషయంలో కలెక్టర్ లు బాధ్యత వహించాలన్నారు. జిల్లా ఎస్పీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. 

read more  పక్షపాతం లేకుండా ప్రమోషన్లు...సీఎం జగన్ ను కలిసిన ఏఎస్పీలు

రాష్ట్ర వ్యాప్తంగా 91 చెక్ పోస్ట్ లు సిద్దమయ్యాయని అన్నారు. ఇంకా 242  చెక్ పోస్ట్ లు పూర్తి కావాల్సి వుందన్నారు. ఆర్థిక భారం లేకుండా అన్ని నిధులు ఇస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా కలెక్టర్ లు సమన్వయం చేసుకుని పనిచేయాలని మంత్రి కలెక్టర్లకు ఆదేశించారు. 

ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.