Asianet News TeluguAsianet News Telugu

పక్షపాతం లేకుండా ప్రమోషన్లు...సీఎం జగన్ ను కలిసిన ఏఎస్పీలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. దీంతో గత ఐదేళ్లుగా ఈ  ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న డీఎస్పీల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.   

ap police officers comments on promotions
Author
Amaravathi, First Published Dec 4, 2019, 5:13 PM IST

అమరావతి: 2014 నుంచి పెండింగులో ఉన్న తమ ప్రమోషన్లకు అంగీకారం తెలిపి, పదోన్నతి కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఏఎస్పీలు ధన్యవాదాలు తెలియజేశారు. డీఎస్పీల నుంచి ఏఎస్పీలుగా పదోన్నతి పొందిన అధికారులు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. 

పదోన్నతుల్లో పక్షపాతం లేకుండా అన్ని కేటగిరీ అధికారులకు వారి అర్హతల ప్రకారం ప్రమోషన్లు కల్పించారని ఏఎస్పీలు ముఖ్యమంత్రితో వ్యాఖ్యానించారు. ఇదివరకు కొంతమందికే లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని...ఈసారి పక్షపాతానికి తావులేకుండా అర్హతలున్నవారందరికీ సమాన స్థాయిలో పదోన్నతులు వచ్చాయని ముఖ్యమంత్రితో అన్నారు. 

ప్రజలకు రక్షణ కల్పించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని ప్రమోషన్లు పొందిన ఏఎస్పీలు ముఖ్యమంత్రి  జగన్ తో చెప్పారు. కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతంసవాంగ్, అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ తదితరులు పాల్గొన్నారు.

read more  ఏపి పోలీసులకు గుడ్ న్యూస్... జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం

అంతేకాకుండా పోలీసులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పోలీసు సంక్షేమ నిధి నుంచి నిర్వహిస్తున్న గ్రూపు ఇన్సూరెన్స్‌ విలువను భారీగా పెంచారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోలీసుల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ ను పెంచడంపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సై వరకూ సుమారు రూ.13 లక్షల ఇన్సూరెన్స్‌గా చెల్లిస్తుండగా ఈసారి దాన్ని రూ.20లక్షలకు పెంచారు. అలాగే ఎస్సై నుంచి ఇన్‌స్పెక్టర్‌వరకూ రూ.35 లక్షలను చెల్లించనున్నారు. డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 45 లక్షలను గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కింద చెల్లించనున్నారు. 

క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు. ఈ గ్రూపు ఇన్సూరెన్స్‌తో పాటు ప్రమాదవశాత్తు పోలీసులకు ఏదైనా జరిగితే దాని కింద చెల్లించే బీమాను గణనీయంగా పెంచారు. 

read more  ఆడపిల్లల మాన ప్రాణాలంటే పవన్ కు ఇంత చులకనా...: మంత్రి పుష్ప శ్రీవాణి ఫైర్

ఎవరైనా పోలీసు సిబ్బంది అసహజ మరణం పొందితే రూ. 30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడి కారణంగా ప్రాణాలు కోల్పోతే రూ. 40 లక్షల రూపాయలను అందిస్తూ కొన్నిరోజుల క్రితమే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. ఇందులో  64719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుంది. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఈ పాలసీలు అమలుకానున్నాయి. 

 వారాంతపు సెలవుతో 64 వేలమంది పోలీసు కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని, అలాగే పోలీసుల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌తోపాటు, యాక్సిడెంటల్‌ పాలసీ విలువకూడా పెంచి మరింత భరోసా నిచ్చిందని పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios