ఇప్పటివరకు ఒకలెక్క...ఇప్పట్నుంచీ మరోలెక్క...రాయలసీమపై జగన్ వరాలు
తాను పుట్టిపెరిగిన రాయలసీమ ప్రాంతంపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అభిమాానాన్ని చాటుకున్నారు. వెనుకబడిన ప్రాంతమైన సీమలో నీటిపారుదల వ్యవస్ధను మెరుగుపర్చనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు.
అమరావతి: రాయలసీమలో కరువును పారదోలి సాగుకు నీరందించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురిసినా రాయలసీమ ప్రాజెక్టులను ఎందుకు నింపలేకపోయారని ప్రతిపక్షం ప్రశ్నిస్తోందని... ఇదే ప్రశ్న తాను అనేక సందర్భాల్లో ప్రస్తావించానని అన్నారు. దేవుడు కరుణించి వర్షాలు కురిపించినా ఆ నీళ్లను ఒడిసిపట్టి ప్రాజెక్టులను నింపకపోవడం గత ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు.
అసెంబ్లీలో రాయలసీమలో నీటిపారుదల వ్యవస్థ,, ప్రాజెక్టుల నిర్మాణంపై సీఎం జగన్ మాట్లాడారు. ఇరిగేషన్‌శాఖతో సమీక్షా సమావేశాల సందర్భంగా కూడా ప్రాజెక్టుల పరిస్థితి గురించి తెలుసుకుని మన ఖర్మ ఇలా ఉందని మొత్తుకున్నాని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చికేవలం 6 నెలలు మాత్రమే అయ్యిందని అన్నారు. చంద్రబాబు తన ఐదేళ్లకాలంలో చేయాల్సిన పనులు చేసి ఉంటే.. ప్రతి నీటి బొట్టును కూడా ప్రాజెక్టుల్లో పెట్టుకునేవాళ్లమని పేర్కొన్నారు.
భారీ వరద నీరు ప్రయోజనం లేకుండానే సముద్రంలోకి వెళ్లిపోతున్నాయి కాని రాయలసీమలో ప్రాజెక్టులు నిండడం లేదని గుర్తుచేశారు. గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు చిత్తశుద్ధిపెట్టి ఉంటే కాల్వల సామర్థ్యాన్నిపెంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇచ్చి ఉంటే ఈరోజు ఆ డ్యాముల్లో నీళ్లు పుష్కలంగా ఉండేవని జగన్ అన్నారు.
గోరకల్లు 12.44 టీఎంసీలు పూర్తి సామర్థ్యం అయితే 8 టీఎంసీలు మాత్రమే నింపగలిగారని వెల్లడించారు. అలాగే గొల్లపల్లి రిజర్వాయర్‌లో 1.9 టీఎంసీలకు గాను కేవలం 1 టీఎంసీ మాత్రమే నింపగా అనంతపురంలోని మిడ్‌పెన్నార్‌లో 5 టీఎంసీలకు గాను కేవలం 3.5 టీఎంసీలు మాత్రమే నింపినట్లు తెలిపారు.
''పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన చిత్రావతి రిజర్వాయర్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. బహుశా నా నియోజకవర్గానికి సంబంధించినది కావడమే అది చేసుకున్న పాపమేమోనని అనిపిస్తోంది. ఇన్ని నీళ్లు వచ్చినా... నీళ్లు నింపండి, నింపండి అని పదేపదే చెప్పినా కూడా 10 టీఎంసీలకు గాను 6.8 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయగలిగారు'' అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE వైసీపీ సర్కార్ కి జేసీ టైటిల్ ఇదే.....: జగన్ కు సెల్యూట్ చేసిన దివాకర్ రెడ్డి
ఇక గండికోట 26.5 టీఎంసీలకు గాను కేవలం 12 టీఎంసీల నీళ్లుమాత్రమే నిల్వచేయగలిగామని తెలిపారు. మాజీ సీఎం చంద్రబాబుగారిని ఒక్కోసారి చూసినప్పుడు ఆయన మనిషేనా అనిపిస్తుందన్నారు. పెన్నా అహోబిలం బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 11 టీఎంసీలకుగాను ఇవాళ్టికి 3.38 టీఎంసీలు మాత్రమే నింపగలిగామని వెల్లడించారు.
బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ 17.93 టీఎంసీలకు గానూ కేవలం 6.28 టీఎంసీలు మాత్రమే నిల్వచేయగలిగామని... ఈ ప్రాజెక్టుకు వెలుగోడు నుంచి వెళ్లే కాల్వలో నీళ్లు సరిపడా పోవడంలేదన్నారు. ఆ కాల్వ సామర్థ్యం సరిపోవడం లేదని 5వేల క్యూసెక్కుల నీళ్లు పోవాల్సిన చోట 2వేల క్యూసెక్కులు కూడా పోవడంలేదన్నారు. కెనాల్ మరమ్మతు చేయించమని గత ప్రభుత్వాన్ని తమ పార్టీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సహా మేం కూడా పలుమార్లు చెప్పామని...
కాని ఐదేళ్లలో మా మాట విన్న పాపాన పోలేదని మండిపడ్డారు.
పైడిపాలెం రిజర్వాయర్ నింపడానికి గట్టి ప్రయత్నాలు చేశాం కాబట్టే 6 టీఎంసీలకు 5.44 టీఎంసీలు నిల్వ చేయగలిగామన్నారు. ఇన్ని వర్షాలు పడినా కూడా ఎందుకు రాయలసీమలో నింపలేకపోయాం అని మనం సభలో ఆలోచనలు చేయాల్సి వుందన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు చేయాల్సిన పనులు చేసి కాల్వల సామర్థ్యంపెంచి ఉంటే ఈసరికి ప్రతి ప్రాజెక్టూ నిండుకుండలా ఉండేదని జగన్ అన్నారు.
ఈ సమస్యలను అధిగమించాలన్న చిత్తశుద్దితో కాల్వలు మరమ్మతు చేయాలని ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుందన్నారు. ఆర్ అండ్ ఆర్ ఇవ్వడానికి అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నామని అన్నారు.
గత ప్రభుత్వం గండికోట ప్రాజెక్టు కింద ఇవ్వాల్సిన రూ.980 కోట్లు ఆర్ అండ్ ఆర్ కింద ఇచ్చి ఉంటే ఇవాళ ఆ ప్రాజెక్టును పూర్తిగా నింపేవాళ్లమన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు 2004 నుంచి 2014 వరకూ జీఎన్‌ఎస్‌ఎస్ రూ. 5,036కోట్లు ఖర్చుచేశారని...హంద్రీనీవాకు సంబంధించి రూ. 6,593 కోట్లు ఖర్చుచేశారని గుర్తుచేశారు.
కానీ చంద్రబాబు హయాంలో గండికోట సహా ఇతర రాయలసీమ ప్రాజెక్టులకు చేసిన ఖర్చు కేవలం రూ.198 కోట్లేనని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయని అప్పటికప్పుడు హడావిడిగా రూ.400 కోట్లు ఆర్ అండ్ ఆర్ కింద విడుదల చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు. అయితే అదే రూ.420 కోట్లు రూపాయలకు ఇంకో రూ.980 కోట్లు యాడ్‌చేసి తన పరిపాలనా కాలంలో ఇచ్చి ఉంటే గండికోటను పూర్తిగా నింపేవాళ్లం కాదా? అని ప్రశ్నించారు.
వెలిగొండకు సంబంధించి ఆర్ అండ్ ఆర్ కింద ఇంకా వేయి కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నారు. అది ఇస్తేనే రేపు జూన్‌కల్లా కనీసం నీళ్లు నింపే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు ఎప్పుడూ పట్టించుకోలేదని విమర్శించారు. అధికారంలోకి తాము రాగానే ఆర్ అండ్ ఆర్‌కు సంబంధించి ప్రక్రియను ప్రారంభించామని... అధికారులంతా దీనిమీద ధ్యాసపెట్టారని వెల్లడించారు.
ఎన్టీఆర్ కి మైక్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటంటే... యనమల
గండికోట ఆర్ అండ్ ఆర్‌కు సంబంధించి రూ.980 కోట్లు, వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మరో వేయి కోట్లు ఇవ్వడానికి సిద్దపడుతున్నామని అన్నారు. వరద వచ్చినప్పుడు యాభై రోజుల్లోగా ఆ వరదనీటిని రాయలసీమలోని అన్ని డ్యాంలు నింపేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. దీనికోసం కార్యాచరణ చేపట్టబోతున్నట్లు తెలిపారు. అందుకోసం ఇంజినీర్లు, నిపుణులు కలిసి నివేదికలు తయారుచేస్తున్నామని అన్నారు. వీటన్నింటినీ నెలరోజుల్లోపు పూర్తిచేసి టెండర్లను పిలిచే కార్యక్రమాన్ని చేపడుతున్నాని వెల్లడించారు.
''దేవుడు ఆశీర్వదించి మళ్లీ ఇలాంటి వర్షాలు పడితే యాభై రోజుల్లోగా ప్రాజెక్టులను నింపడానికి కార్యాచరణ చేస్తున్నాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులకు తీసుకువెళ్లడానికి కార్యాచరణ చేస్తున్నాం. తెలుగు గంగ కెనాల్‌స్థాయిని 11,500 క్యూసెక్కుల నుంచి 18వేల క్యూసెక్కులకు పెంచే కార్యక్రమాన్ని చేస్తున్నాం . ఎస్సార్‌బీసీ కెనాల్ సామర్థ్యాన్ని 21వేల క్యూసెక్కుల నుంచి 30వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం.
కేసీకెనాల్–నిప్పులవాడు 12500 క్యూసెక్కులనుంచి 35వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం. అవుకు టన్నెల్ కెపాసిటీ 20వేల క్యూసెక్కులు కాగా చంద్రబాబు ఐదేళ్లపాలన తర్వాత కూడా ఇంకా 10వేల క్యూసెక్కుల స్థాయికే పరిమితమైంది. దీన్ని 30వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం. గండికోట కెనాల్ కెపాసిటీ 20వేల క్యూసెక్కుల నుంచి 30వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం.
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాల్వలో 2100 క్యూసెక్కుల నీరు కూడా సరిగ్గా పోవడం లేదు. దీన్ని 6వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం. తెలుగుగంగ మెయిన్ కెనాల్ టు వైయస్సార్ కడప కాల్వ సామర్థ్యాన్ని 3500 నుంచి 8వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం. గండికోట నుంచి సీబీఆర్ లిఫ్ట్ 2వేల క్యూసెక్కుల నుంచి 4వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం.
గండికోట నుంచి జీఎన్‌ఎస్ మెయిన్‌కెనాల్ 4వేల క్యూసెక్కులనుంచి 6వేల క్యూసెక్కులకు పెంచే కార్యక్రమాన్ని చేస్తున్నాం. వీటికి సంబంధించి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. వచ్చే నెలరోజుల్లో టెండర్లకు పోతున్నాం. దివంగత నేత, ప్రియతమనాయకుడు కలలుగన్న రాయలసీమగా ప్రాజెక్టులన్నీ నీళ్లతో కళకళలాడే పరిస్థితులు వస్తాయి'' అని జగన్ ఉద్ఘాటించారు.