బర్మింగ్‌హామ్‌: పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరకుండా టీమిండియా కుట్ర చేస్తుందని ఆ దేశం మాజీ క్రికెటర్ బాసిత్ అలీ చేసిన వ్యాఖ్య ఒక మ్యాచ్ కు ముందే నిజమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ లతో జరిగే మ్యాచుల్లో భారత్ కావాలని ఓడిపోతుందని, తద్వారా పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు చేరకుండా అడ్డుకుంటుందని అన్నారు. 

ఆదివారంనాడు ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో ధోనీ బ్యాటింగ్ కు దిగినప్పటి నుంచి జరిగిన తంతును చూస్తే అది నిజమే కావచ్చునేమో అనిపిస్తోంది. భారత్ ఏ మాత్రం పోరాట పటిమ కనబరచకుండా తలొగ్గిందని ఇంగ్లాండు మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ అన్నాడు. సింగిల్స్ తీయడానికి గల కారణాలపై తన వద్ద వివరణ లేదని గంగూలీ అన్నాడు. చివరి కొన్ని ఓవర్లలో ధోనీ తీరు అయోమయానికి గురి చేసిందని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు.

ఈ మాజీ క్రికెటర్లంతా ధోనీ తీరుపై, భారత బ్యాటింగ్ విధానంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగానే వ్యాఖ్యలు చేశారు. ధోనీ బ్యాటింగ్ కు దిగిన తర్వాత హార్జిక్ పాండ్యా బ్యాటింగ్ మందగించడంపై, ఆ తర్వాత కేదార్ జాదవ్ తో కలిసి ధోనీ ఆడిన తీరుగానీ అనుమానాలకు తావిచ్చే విధంగానే ఉందనేది విశ్లేషకుల మాట.

నిజంగానే భారత్ పాకిస్తాన్ ను అడ్డుకోవడానికి ఇంగ్లాండుపై మ్యాచును ఓడిపోయిందా అనేదానికి కచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. కానీ ఇంగ్లాండుపై భారత్ ఓడిపోవడం వల్ల పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు చేరుకునే అవకాశాలపై తీవ్రమైన దెబ్బ పడింది.

ఇంగ్లాండుపై భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ప్రపంచ కప్ పోటీల్లో భారత్ కు ఇది తొలి పరాజయం.  ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడింది. భారత్ ప్రస్తుతం 11 పాయింట్లతో ఉంది. ఇంగ్లాండుపై ఓటమి పాలైనప్పటికీ భారత్ సెమీ ఫైనల్ చేరుకునే అవకాశాలకు విఘాతం ఏమీ కలగలేదు. 

అయితే, భారత ఓటమి ఇంగ్లాండుకు ప్రాణదానం చేసింది. అయితే, పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరుకునే అవకాశాలు మాత్రం సన్నగిల్లాయి. భారత్ సెమీ ఫైనల్ చేరుకోవడానికి తదుపరి ఆడే రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా సరిపోతుంది. బంగ్లాదేశ్ పై జులై 2వ తేదీన శ్రీలంకపై జూలై 6వ తేదీన భారత్ మ్యాచులు ఆడుతుంది. ఈ రెండు కూడా అంత బలమైన జట్లు కావు కాబట్టి ఇండియాకు విజయం పెద్ద కష్టం కాకపోవచ్చు. 

సంబంధిత వార్తలు

పాక్ పై కుట్ర, కావాలని వారిపై ఇండియా ఓడుతుంది: పాక్ మాజీ క్రికెటర్

విచిత్రం: ఇంగ్లాండుపై ఇండియాను ఓడించింది ధోనీయే...