ఇటీవల ముగిసిన ఐసిసి ప్రపంచ కప్ టోర్నీ న్యూజిలాండ్ జట్టును తీవ్రంగా నిరాశపర్చింది. అద్భుత  పోరాటం ఫలితంగా వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకున్నప్పటికి విశ్వవిజేతగా నిలవలేకపోంది. ఇలా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓటమిపాలవడంతో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ బాధపడుతుండగా దాన్ని రెట్టింపు చేసే ఛేదు వార్త అతడు వినాల్సి వచ్చింది. ఉత్కంభరితంగా సాగిన ఈ మ్యాచ్ చూస్తూ నీషమ్ చిన్ననాటి క్రికెట్ కోచ్ డేవిడ్ జేమ్స్ గోర్డాన్ మృతిచెందాడు. 

గోర్డాన్ హటాన్మరణం గురించి ఆయన కూతురు లియోనీ ఈ విధంగా వివరించారు. '' ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య లార్డ్స్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ మా నాన్న గోర్డాన్ టీవిలో చూస్తున్నాడు. అయితే ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్ ను చూస్తూ అతడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ముఖ్యంగా మ్యాచ్ టై అయిన తర్వాత సూపర్ ఓవర్లో తన శిష్యుడు నీషమ్ బ్యాటింగ్ ను చూస్తూ అతడు మరింత ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే నీషమ్ సిక్స్ బాదిన సమయంలో ఆయనకు హాట్ స్ట్రోక్ వచ్చింది.'' అంటూ లియోనీ ఆవేధనకు లోనయ్యారు. 

ఇప్పటికే ప్రపంచ కప్ టోర్నీ ఓటమితో బాధలో వున్న తనకు చిన్ననాటి గురువు మరణం  మరింత బాధలోకి నెట్టిందని నీషమ్ అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్న నీషమ్ ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని ప్రకటించాడు. '' డేవ్ గోర్డాన్... నా హై స్కూల్ టీచరే కాదు చిన్ననాటి కోచ్ మరియు మంచి స్నేహితుడు. నువ్వు(గోర్డాన్) క్రికెట్ అంటే ఎంత ఇష్టపడేవాడివో నాకు తెలుసు. మీలాంటి  గొప్ప వ్యక్తి దగ్గర క్రికెట్ ఓనమాలు  నేర్చుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం.   

 ఈ మ్యాచ్ లో మా ఆటతీరు చూసి మీరు గర్వించి వుంటారని అనుకుంటున్నా. క్రికెటర్ నేను ఈ స్థాయిలో వుండటానికి  సహకరించిన మీకు నేను ఎల్లపుడు రుణపడి వుంటాను. మీరు నాకు అందించిన సహాకారానికి ధన్యవాదాలు.'' అంటూ నీషమ్ తన గురువు మృతికి సంతాపం ప్రకటించారు.