ప్రపంచ కప్ ఓటమి ఎఫెక్ట్: శ్రీలంక జట్టులో ప్రక్షాళన షురూ...ముందుగా వారిపైనే వేటు...?
ప్రపంచ కప్ టోర్నీలో ఘోరంగా విఫలమైన శ్రీలంక జట్టులో ప్రక్షాళన మొదలయ్యింది. ఏకంగా ఈ వ్యవహారాన్ని ఆ దేశ క్రీడల మంత్రి హరిన్ ఫెర్నాండో దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇలా లంక జట్టుకు పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో శ్రీలంక జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. సెమీస్, ఫైనల్ కు చేరడం మాట అటుంచి కనీసం లీగ్ దశలో విజయాలను సాధించేందుకు కూడా ఆ జట్టు ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ఇలా ఇంగ్లాండ్ గడ్డపై లంక జట్టు ఘోరంగా విఫలమై కేవలం 3 విజయాలతో సరిపెట్టుకుని ఘోర అవమానంతో ఇంటిదారి పట్టింది.
జట్టు ప్రక్షాళన...క్రీడా మంత్రి పర్యవేక్షణలో
అయితే ప్రపంచ దేశాలు పాల్గొన్న ప్రతిష్టాత్మక టోర్నీలో దేశ ప్రతిష్టను దిగజార్చిలే సాగిన శ్రీలంక జట్టుపై ఆ దేశ ప్రభుత్వం గుర్రుగా వుంది. దీంతో ఈ వ్యవహారంలోకి ఏకంగా క్రీడా మంత్రి హరిన్ ఫెర్నాండో జోక్యం చేసుకుని మరీ జట్టు ప్రక్షాళన బాధ్యతలను చేపడుతున్నాడు. ఆయన శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా లంక చీఫ్ కోచ్ చండిక హతురుసింగ తో పాటు ఇతర కోచింగ్ సిబ్బందిని కూడా వెంటనే తొలగించాలని లంక బోర్డుకు ఆయన ఆదేశించాడు. మరికొద్దిరోజుల్లో జరగనున్న బంగ్లాదేశ్ తో జరగనున్న సీరిస్ తర్వాత వీరిని తొలగించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాడట. ప్రస్తుతానికి కోచింగ్ సిబ్బందిని తొలగించి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన మంత్రి తర్వాత ఎవరిపై పడతాడోనని శ్రీలంక క్రికెట్ వర్గాల్లో ఆందోళన నెలకొంది.
కోచ్ ఏమన్నాడంటే
వారం రోజుల క్రితమే శ్రీలంక కోచ్ మీడియాతో మాట్లాడుతూ...శ్రీలంక జట్టు కోచ్ గా తానింకా దాదాపు ఏడాదిన్నర కాలం పనిచేయనున్నట్లు తెలిపాడు. లంక బోర్డుతో తాను చేసుకున్న ఒప్పందం పూర్తవడానికి ఇంకా 16నెలల సమయముందని తెలిపాడు. అంతవరకు తానే కోచ్ గా కొనసాగనున్నట్లు అతడు ధీమా వ్యక్తం చేశాడు.
ప్రపంచ కప్ టోర్నీలో జట్టు వైఫల్యంపై మేనేజ్ మెంట్ బాధ్యత వహించాలని అన్నాడు. జట్టు కూర్పు, అనుసరించి వ్యూహాల్లో మాత్రమే లోపముందని... చాలా మంది ఆటగాళ్లు అత్యుత్తమంగా ఆడారని హతురుసింగ పేర్కొన్నాడు. దీన్ని బట్టే ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది వైఫల్యం చెందలేదని...మేనేజ్ మెంట్ విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించాడు.