బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండుపై ఆదివారం జరిగిన మ్యాచులో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్ బ్యాటింగ్ తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. గొప్ప ఫినిషర్ గా పేరు గాంచిన ధోనీ ఆదివారం ఇంగ్లాండుపై బ్యాటింగ్ చేసిన తీరు తీవ్రమైన విమర్శలకు గురవుతోంది. భారీ షాట్లకు వెళ్లకుండా నింపాదిగా ఆడుతూ సింగిల్స్ మాత్రమే తీస్తూ వచ్చారు. డాట్ బాల్స్ కూడా చాలానే వచ్చాయి.

ధోనీ, కేదార్ జాదవ్ బ్యాటింగ్ కు దిగిన సమయంలో ఇంగ్లాండుపై విజయానికి ఇండియా ఐదు ఓవర్లలో 71 పరుగులు చేయాల్సి ఉండింది. వీరిద్దరు కూడా భారీ షాట్లకు వెళ్లకుండా, బంతిని పుష్ చేస్తూ చాలా తీరికగా సింగిల్స్ తీస్తూ వెళ్లారు. దాంతో చివరి ఐదు ఓవర్లలో ఇద్దరు కలిసి కేవలం 39 పరుగులు మాత్రమే చేశారు. 

 

అయితే, వారిద్దరిని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సమర్థించాడు. మహీ, జాదవ్ భారీ షాట్లకు ప్రయత్నించారు గానీ పిచ్ మందకొడిగా ఉండడం వల్ల సాధ్యం కాలేదని అతను అన్నాడు. చివరలో పిచ్ మరింత మందకొడిగా మారిందని, కండీషన్స్ ను ఇంగ్లాండు బాగా వాడుకుందని, ఆ క్రెడిట్ వారిదేనని అన్నాడు. బౌలింగులో వేరియేషన్స్ చూపిస్తూ తమను ఇబ్బంది పెట్టారని అన్నాడు. 

 

ధోనీ 31 బంతుల్లో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధోనీ తీరును కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా సమర్థించాడు. బంతులను బలంగా కొట్టి బౌండరీ దాటించాలని ధోనీ ప్రయత్నించాడని, దురదృష్టవశాత్తు అతను అర్థ సెంచరీ చేయలేకపోయాడని అన్నాడు.