389 భారీ లక్ష్యం...ప్రత్యర్థేమో స్టార్క్, కమిన్స్ వంటి మేటి బౌలర్లను కలిగిన ఆస్ట్రేలియా జట్టు...అయినా బంగ్లాదేశ్ ఏమాత్రం వెన్నుచూసలేదు. దాదాపు భారీ లక్ష్యానికి చేరువగా వచ్చే వరకు పోరాడి మ్యాచ్ ను ఓడిపోయిన అభిమానుల మనసులు మాత్రం గెలుచుకుంది. ఏకంగా 333 పరుగుల వరకు మ్యాచ్ ను లాక్కొచ్చి కేవలం 48 పరుగుల  తేడాతో ఓటమిపాలయ్యింది. సాధించాల్సిన  రన్ రేట్ భారీగా  వున్నా బంగ్లా బ్యాట్ మెన్స్ ఏమాత్రం నిరాశ చెందకుండా గెలుసు కోసం చూపించిన పోరాట పటిమకు బంగ్లా అభిమానులే కాదు  క్రికెట్ ప్రియులంతా ఫిదా  అయిపోయారు.

 బ్యాట్ మెన్స్ సమిష్టిగా రాణించడంతో ఆసిస్ చేతిలో బంగ్లా ఘోర ఓటమిని చవిచూడకుండా  తప్పించుకుంది. ముఖ్యంగా ముష్ఫికర్ రహీమ్ అద్భుత సెంచరీ(102 పరుగులు  97 బంతుల్లో) నాటౌట్ గా నిలిచి బంగ్లాను గెలిపించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. అతడితో పాటు ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 62, మహ్మదుల్లా 69, షకిబుల్ హసన్ 41 పరుగులతో రాణించారు. అయితే సాధించాల్సిన పరుగుల మరీ ఎక్కువగా వుండటంతో వారు విజయాన్ని అందుకోలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ , కుల్టర్ నైల్, స్టోయినీస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా జంపా  ఒక వికెట్ తీశాడు.

 కొండంత లక్ష్యం కళ్లముందున్నా బంగ్లా పోరాటాన్ని వదలడం లేదు. సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా వున్నా చేతులెత్తేయకుండా ప్రపంచ స్థాయి ఆసిస్ బౌలర్లను ఎదుర్కొంటూ గెలుపుపై  ఆశలను రేకెత్తిస్తున్నారు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్  62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత లిటన్ దాస్ 20  పరుగులు  చేసి జంపా బౌలింగ్ లో ఔటయ్యాడు. అయితే ప్రస్తుతం ముష్ఫికర్ రహీమ్(76 పరుగులు), మహ్మదుల్లా 46 పరుగులతో ధాటిగా ఆడుతున్నారు. 

భారీ  లక్ష్యాన్నిఛేధించే క్రమంలో వేగంగా బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్ అద్భుత సెంచరీతో ఆకట్టుకుని బంగ్లాను సంచలన విజయాన్ని అందించిన ఆల్ రౌండర్  షకిబుల్ హసన్ ఔటయ్యాడు. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోయినీస్ బౌలింగ్ లో  ఇతడు ఔటయ్యాడు. దీంతో 102 పరుగుల వద్ద బంగ్లా రెండో వికెట్ కోల్పోయింది. 

382 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సౌమ్యా సర్కార్(10 పరుగులు) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. దీంతో 23 పరుగుల వద్ద బంగ్లా మొదటి వికెట్  కోల్పోయింది. 

బంగ్లా బౌలర్లను చితక్కొట్టిన  ఆస్ట్రేలియా 381 పరుగుల భారీ స్కోరు సాధించింది.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (166 పరుగులు) సెంచరీతో పాటు ఫించ్(53 పరుగులు), ఖవాజా(89 పరుగులు) లు కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. చివర్లు మ్యాక్స్ వెల్ (10 బంతుల్లో 32 పరుగులు) మెరుపులు తోడవడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ 3, రహ్మాన్  1 వికెట్ తీసి ఆకట్టకోగా మిగతావారెవరు రాణించలేకపోయారు. 

ప్రమాదకరంగా మారిన ఖవాజా, మ్యాక్స్ వెల్ లను ఒకే ఓవర్లో సౌమ్య సర్కార్ పెవిలియన్ కు పంపించాడు. 46వ ఓవర్లో రెండో బంతికి మ్యాక్స్ వెల్( 10 బంతుల్లో 32 పరుగులు) రనౌటవగా అదే ఓవర్ ఐదో బంతికి ఖవాజా(89 పరుగులు 72 బంతుల్లో) కూడా క్యాచ్ ఔటయ్యాడు. దీంతో ఆసిస్ 353 పరరుగుల  వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే మరో పరుగు తేడాతో స్మిత్ కూడా ఔటయ్యాడు. 

డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను ఎట్టకేలకు సౌమ్య సర్కార్ పెవిలియన్ కు పంపించాడు. కేవలం 147 బంతుల్లోనే 166 పరుగుల చేసిన వార్నర్ కూడా సేమ్ ఫించ్ మాదిరిగానే రూబెల్ హుస్సెన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఆసిస్ 313 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.  

ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరో సెంచరీతో అదరగొట్టాడు. ఇప్పటికే ప్రపంచ కప్ 12 లో ఓ సెంచరీని తన ఖాతాలో వేసుకున్న అతడు బంగ్లాదేశ్ పై కూడా సెంచరీని నమోదుచేసుకున్నాడు. ఈ సెంచరీతో వార్నర్ వన్డెల్లో 16 వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇలా వార్నర్ విజృంభించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. 

ఎట్టకేలకు ఆసిస్ ఓపెనర్లను విడదీయడంలో బంగ్లా సఫలమైంది. సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మరింత ప్రమాదకరంగా మారుతున్న ఆస్ట్రేలియా  ఓపెనింగ్ జోడీని సౌమ్య సర్కార్ విడదీశాడు. హాఫ్ సెంచరీ (51 బంతుల్లో 53 పరుగులు) చేసిన ఫించ్ ను రూబెల్ హుస్సెన్  కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 121 పరుగుల వద్ద కంగారు జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. 

బంగ్లాపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ జట్టు ఓపెనర్లు  చెలరేగుతున్నారు. డేవిడ్ వార్నర్ ఇప్పటికే అర్థ శతకాన్ని పూర్తి చేసుకోగా మరో ఓపెనర్ ఫించ్ అందుకు చేరువలో వున్నాడు. దీంతో కంగారు జట్టు 18 ఓవర్లలోపే సెంచరీ కొట్టేసింది. 

ప్రపంచ కప్ టోర్నీలో మరో రసవత్తర పోరుకు నాటింగ్ హామ్ వేదికకానుంది. సంచలన విజయాలతో దూసుకుపోతున్న బంగ్లాదేశ్ డిపెండింగ్ ఛాంపియన్  ఆస్ట్రేలియాతో ఇవాళ(గురువారం) తలపడనుంది.  ఈ మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను ఆసిస్ గెలుచుకుంది. దీంతో కెప్టెన్ ఆరోన్ పించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

తుది జట్లు:  

బంగ్లాదేశ్ టీం:

తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), లిటన్ దాస్, మహ్మదుల్లా, షబ్బీర్ రహ్మాన్, మెహింది హసన్, ముష్రఫే మోర్తజా(కెప్టెన్), రుబెల్ హుస్సెన్, ముస్తాఫిజుర్ రహ్మాన్ 

ఆస్ట్రేలియా టీం:

ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్,  స్టోయినీస్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), నాథన్ కల్టర్ నైల్, పాట్ కమ్మిన్స్,  మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

సంబంధిత వార్తలు

2019 వరల్డ్ కప్ లో భారత్ తలపడే మ్యాచుల షెడ్యూల్