ఇంగ్లాండు 42 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. సూపర్ ఓవరులో న్యూజిలాండ్ ఇంగ్లాండు స్కోరును సమం చేసింది అయితే, మ్యాచులో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండు విజయాన్ని అందుకుంది. తొలిసారి ఇంగ్లాండు విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లాండు తరఫున ఆర్చర్ సూపర్ వేశాడు. తొలి బంతి వైడ్ అయింది. మధ్యలో ఓ సిక్స్ కూడా వెళ్లింది. కానీ, చివరి బంతికి రెండు పరుగుల చేయాల్సిన స్థితిలో న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ గుప్తిల్ రన్నవుట్ అయ్యాడు. జోసన్ రాయ్ మిడ్ వికెట్ నుంచి విసిరిన బంతితో గుప్తిల్ రన్నవుట్ అవుటయ్యాడు. దీంతో ఇంగ్లాండు ప్రపంచ  కప్ విజేతగా నిలిచింది.

ఫైనల్ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవరులో బ్యాటింగ్ కు ఇంగ్లాండు ఆటగాళ్లు స్టోక్స్, బట్లర్ దిగారు. సూపర్ ఓవరులో ఇంగ్లాండు 15 పరుగులు చేసింది. 16 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ చేతులెత్తేసింది.

విజయం కోసం ఒక్క బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో రెండో పరుగు చేయబోయి వుడ్ రన్నవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ టై అయింది. న్యూజిలాండ్ చేసిన 241 పరుగులను ఇంగ్లాండు చివరి ఓవరు చివరి బంతికి సమం చేసింది. స్టోక్స్ ఒంటరి పోరాటం చేశాడు. అతను 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 227 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఆర్చర్ నీషం బౌలింగులో డకౌట్ అయ్యాడు.ఇంగ్లాండు 220 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ప్లంకెట్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నీషం బౌలింగులో అవుటయ్యాడు.

ఇంగ్లాండు 203 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. వోక్స్ 2 పరుగులు మాత్రమే చేసి ఫెర్గూసన్ బౌలింగులో అవుటయ్యాడు.196 పరుగుల వద్ద ఇంగ్లాండు ఐదో వికెట్ కోల్పోయింది. బట్లర్ 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫెర్గూసన్ బౌలింగులో సౌథీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు.

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో ఫెర్గూసన్ అద్భుతమైన క్యాచ్ ద్వారా ఇంగ్లాండు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ను పెవిలియన్ కు చేర్చాడు. నీషం వేసిన బంతిని మోర్గాన్ గాలిలోకి లేపాడు. ఫెర్డూసన్ తన స్థానం నుంచి పరుగెత్తి వస్తూ బంతిని మైదానానికి కొద్ది ఎత్తులో గాలిలోనే పట్టుకున్నాడు. దీంతో మోర్గాన్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. ఇంగ్లాండు 86 పరుగుల స్కోరు వద్ద మోర్గాన్ అవుట్ తో నాలుగో వికెట్ కోల్పోయింది.

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండు 71 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.36 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెయిర్ స్టో ఫెర్గూసన్ బౌలింగులో వికెట్ ను జారవిడుచుకున్నాడు.

ఇంగ్లాండు 59 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. జో రూట్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గ్రాండ్ హోమ్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. అంతకు ముందుఇంగ్లాండు 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోియంది. జోసన్ రాయ్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెన్రీ బౌలింగులో లాథమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ప్రపంచకప్‌ తుదిపోరులో న్యూజిలాండ్.. ఇంగ్లాండ్ జట్టు ముందు 242 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ నుంచి సరైన సహకారం అందడంతో ఇంగ్లీష్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు.ఆది నుంచి వికెట్లు కోల్పోతూ వచ్చిన న్యూజిలాండ్‌ చివరి ఓవర్లలో ధాటిగా ఆడటంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల  నష్టానికి 241తో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. కివీస్ ఆటగాళ్లలో నికోలస్ 55, లేథమ్ 47 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్ 3, ఫ్లంకేట్ 3, వుడ్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు. 

చివరి ఓవర్లలో ఇంగ్లాండ్ బౌలర్లు రెచ్చిపోయారు. నిలకడగా ఆడిన టామ్ లేథమ్‌ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వోక్స్ బౌలింగ్‌లో విన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.కివీస్ కీలక సమయంలో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న గ్రాండ్ హోమ్మీ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వోక్స్ బౌలింగ్‌లో విన్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

కివీస్ ఐదో వికెట్ కోల్పోయింది. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ధాటిగా ఆడిన నీషమ్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్లంకెట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.న్యూజిలాండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రమాదకర రాస్ టేలర్‌ను 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్ వుడ్ ఎల్బీగా వెనక్కి పంపాడు. దీంతో కివీస్ కష్టాల్లో పడింది. 

నిలకడగా రాణిస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించిన ఓపెనర్ నికోలస్‌ ఔటయ్యాడు. 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్లంకెట్ వేసిన అద్భుతమైన బంతికి నికోలస్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 118 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ ఒత్తిడిలో పడింది. టేలర్, లేథమ్ క్రీజులో ఉన్నారు. 

కివీస్ ఓపెనర్ నికోలస్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 71 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో అతను హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. కెప్టెన్ విలియమ్సన్‌తో కలిసి 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అతను ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. కీలకమైన వికెట్‌ను న్యూజిలాండ్ కోల్పోయింది. నిలకడగా రాణిస్తున్న కెప్టెన్ విలియమ్సన్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫ్లంకెట్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విలియమ్సన్ ఓపెనర్ నికోలస్‌తో కలిసి రెండో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 

న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ గప్టిల్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాత్రి వర్షం కురవడంతో టాస్ షెడ్యూల్ సమయాని కంటే ఆలస్యంగా వేశారు.