మరికొద్దిసేపట్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ పోరు మొదలుకానుంది. బలాబలాలు, ఫామ్ దృష్ట్యా ఇంగ్లాండ్ జట్టుకే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరడమే అతిపెద్ద విజయంగా భావిస్తున్నామని... ఫలితం గురించి ఆలోచించి అనవసరంగా ఒత్తిడికి గురికాదలుచుకోలేదని స్పష్టం చేశాడు.

తాను ట్రోఫీ ఎత్తుకుంటాననే విషయాన్ని పట్టించుకోవడం లేదని.. అనవసరమైన విషయాలను పట్టించుకోకుంటే దాని ఫలితం మరోలా ఉంటుందని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తాను చాలా ప్రశాంతంగా ఉన్నానని.. ఫైనల్స్‌లో ఆడటం కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నానన్నాడు.

తమ జట్టులోని ప్రతి ఆటగాడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటం శుభపరిణామమని మోర్గాన్ తెలిపాడు. కాగా.. ఇప్పటి వరకు ఈ రెండు జట్లూ ప్రపంచకప్ గెలవకపోవడంతో ఈ రోజు ఎవరు గెలుపొందినా చరిత్ర సృష్టించనున్నారు. అయితే లీగ్ దశలో కీవీస్‌పై 119 పరుగుల తేడాతో విజయం ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.