Asianet News TeluguAsianet News Telugu

Ind Vs Nz: ఆ వ్యూహాం బెడిసికొట్టింది.. ఈసారి ప్లాన్ మారుస్తున్నాం : కివీస్ కోచ్ గ్యారీ స్టెడ్

India Vs New Zealand Test: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా టీమిండియాతో న్యూజిలాండ్ తలపడబోతున్నది. బుధవారం కాన్పూర్ వేదికగా జరిగే  ఈ మ్యాచ్ కోసం కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ పక్కా ప్రణాళికతోనే దిగుతున్నది. 

You May Find Us Playing with Three spinners, says New Zealand Coach Gary Stead ahead of Ind Vs Nz First Test
Author
Hyderabad, First Published Nov 23, 2021, 4:51 PM IST

టీమిండియాతో టెస్టు సిరీస్ కు ముందు న్యూజిలాండ్ జట్టు విజయావకాశాలపై దృష్టి  సారించింది. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆడేందుకు గల ఆటగాళ్ల ఎంపికపై ఫోకస్ పెట్టింది. గతంలో  ఇండియాకు వచ్చిన జట్లు పలు లోపాలు చేశాయని, కానీ ఈసారి తాము మాత్రం అవి రిపీట్ చేయబోమని  కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు.  వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో భాగంగా బుధవారం నుంచి భారత్ తో మొదలుకాబోయే టెస్టు సిరీస్ కు ముందు అతడు ఆసక్తికర  వ్యాఖ్యలు చేశాడు. సంప్రదాయ, మూస పద్ధతిలో ఇక్కడ ఆడితే  కుదరదని వ్యాఖ్యానించాడు. 

స్టెడ్ మాట్లాడుతూ.. ‘గతంలో  భారత పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు ఎందుకు ఫెయిలయ్యాయో మేం పరిశీలించాం. కానీ అవే తప్పులను మేమూ చేయకుండా జాగ్రత్త పడుతున్నాం. నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్ తో బరిలోకి దిగితే  ఇండియా పిచ్ లపై ఏ మాత్రం ప్రభావం చూపడానికి అవకాశం లేదు. ఈసారి మేం మా వ్యూహం మార్చబోతున్నాం.’ అని చెప్పాడు. 

‘నలుగురు సీమర్లు, ఒక స్పిన్నర్ తో కాకుండా ఈసారి మేము ముగ్గురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే మేం ఆలోచిస్తున్నాం. అయితే మేం పిచ్ ను పరిశీలించిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి తుది నిర్ణయం తీసుకుంటాం..’అని గ్యారీ స్టెడ్ అన్నాడు. 

ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ ఎంపిక చేసిన జట్టులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లు ఉండటం గమనార్హం. వారిలో భారత మూలాలున్న అజాజ్ పటేల్ తో పాటు విల్ సోమర్విల్లి, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ కూడా ఉన్నాడు. అయితే రవీంద్ర, ఫిలిప్స్ లు బ్యాటింగ్ తోనూ రాణించినా వాళ్లు కూడా పార్ట్ టైమ్  స్పిన్నర్స్ గా పనికొస్తున్నారు. వీరిలో కనీసం ముగ్గురైనా ఆడించొచ్చని తెలుస్తున్నది. ఏదేమైనా తొలి టెస్టులో సాంట్నర్ తో పాటు అజాజ్ పటేల్ ను కూడా ఆడించే అవకాశముంది.

ఉపఖండపు పిచ్ లు సాధారణంగానే స్పిన్ కు ఎక్కువ సహకరిస్తాయి. ఇక్కడ పేసర్ల కంటే స్పిన్నర్లకే వికెట్ టేకింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. న్యూజిలాండ్ పేసర్లు టిమ్ సౌథీ, నీల్ వాగ్నర్, కైల్ జెమీసన్ లు ఉన్నా.. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలనుకుంటే జెమీసన్ బెంచ్ కే పరిమితం కావచ్చు. అయితే పరిస్థితులను బట్టి తమ  వ్యూహాలలో మార్పులు చేసుకుంటామని స్టెడ్ చెప్పాడు. 

‘తొలి మ్యాచ్ లో విజయం సాధిస్తే తర్వాత మ్యాచుల్లో కూడా అదే సూత్రాన్ని పాటిస్తామని చెప్పడం సరికాదు. పిచ్ పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడూ  వ్యూహాలను మారుస్తూ ఉండాలి.. ’ అని స్టెడ్ తెలిపాడు. కాగా, ఇండియా-న్యూజిలాండ్ మధ్య  ఈనెల 25-29 దాకా కాన్పూర్ లో తొలి టెస్టు జరుగనుండగా.. రెండో టెస్టు డిసెంబర్ 3-7 దాకా ముంబైలో నిర్వహించనున్నారు.

ఇండియాతో టెస్టు సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు : కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), కైల్ జెమీసన్,  డరిల్ మిచెల్,  కైల్ జెమీసన్, లామ్ లాథమ్, హెన్రీ నికోలస్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విల్ సోమర్విల్వి, టిమ్ సౌథీ, రాస్  టేలర్, విల్ యంగ్, నీల్ వాగ్నర్ 

Follow Us:
Download App:
  • android
  • ios