Yashasvi Jaiswal: భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్‌లో మరోసారి అదిరిపోయే నాక్ ఆడాడు. ఎడ్జ్‌బాస్టన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో దిగ్గజ ప్లేయర్ల రికార్డులను బద్దలు కొట్టాడు.
Yashasvi Jaiswal: భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బుధవారం (జూలై 2) ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో భారత ఓపెనర్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా జైస్వాల్ రికార్డు సాధించాడు.
1974లో సుధీర్ నాయిక్ చేసిన 77 పరుగుల రికార్డును యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టాడు. జైస్వాల్ 107 బంతుల్లో 87 పరుగులు చేశారు. ఇందులో 13 ఫోర్లు ఉన్నాయి. అయితే సెంచరీని అందుకోవడంలో అతను సక్సెస్ కాలేకపోయాడు. లంచ్ టైమ్ బ్రేక్ దగ్గర ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జైస్వాల్ వికెట్ కోల్పోయాడు. జెమీ స్మిత్ క్యాచ్‌తో అతని మంచి ఈ ఇన్నింగ్స్ ముగిసింది.
బర్మింగ్‌హామ్ టెస్టుల్లో అత్యధిక స్కోరు చేసిన భారత ఓపెనర్లు
• యశస్వి జైస్వాల్ - 87 పరుగులు (2025)
• సుధీర్ నాయిక్ - 77 పరుగులు (1974)
• సునీల్ గవాస్కర్ - 68 పరుగులు (1979)
• ఛతేశ్వర్ పుజారా - 66 పరుగులు (2022)
• సునీల్ గవాస్కర్ - 61 పరుగులు (1979)
జైస్వాల్ బర్మింగ్‌హామ్ లో హాఫ్ సెంచరీ కొట్టిన ఐదో భారత ఓపెనర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సుధీర్ నాయిక్, సునీల్ గవాస్కర్, ఛతేశ్వర్ పుజారా, చేతన్ చౌహాన్ ఉన్నారు. సునీల్ గవాస్కర్ మూడు హాఫ్ సెంచరీలతో టాప్‌లో ఉన్నారు.
2000 టెస్టు పరుగులకు చేరువైన జైస్వాల్
ఈ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ తన టెస్టు కెరీర్‌లో 2000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 10 పరుగుల దూరంలో నిలిచాడు. ఈ మైలురాయిని అత్యల్ప ఇన్నింగ్స్‌లలో చేరిన భారత ఆటగాడిగా నిలిచే అవకాశం ఇప్పటికీ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్‌ల పేరిట ఉంది. ఇద్దరూ 40 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు.
బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్నాడు.. ఫీల్డింగ్‌లో జైస్వాల్ పై విమర్శలు
జైస్వాల్ లీడ్స్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 159 బంతుల్లో 101 పరుగులు చేసి తన బ్యాటింగ్ క్లాస్‌ను చూపించాడు. ఆ ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కేవలం 11 బంతుల్లో నాలుగు పరుగులకే అవుటయ్యాడు.
కానీ, జైస్వాల్ బ్యాటింగ్ ను అందరూ మర్చిపోయేలా చెత్త ఫీల్డింగ్‌తో తీవ్రంగా నిరాశ పరిచాడు. లీడ్స్ టెస్టులో నాలుగు కీలక క్యాచ్‌లు వదిలేశాడు. అందులో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెన్ డకెట్ వికెట్ కూడా ఉంది. బెన్ డకెట్ 97 పరుగుల వుండగా, జైస్వాల్ అతని క్యాచ్ ను వదిలాడు. ఈ క్యాచ్ మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది.
బెన్ స్టోక్స్‌తో మాటల యుద్ధం తర్వాత ఔట్ అయిన జైస్వాల్
రెండో టెస్టులో మొదటి రోజు 17వ ఓవర్‌లో జైస్వాల్–స్టోక్స్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. జైస్వాల్ అద్భుత షాట్ ఆడి బౌండరీ కొట్టిన తర్వాత స్టోక్స్ అతన్ని రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశాడు. ఇద్దరూ పరస్పరం మాటల తూటాలు పేల్చుకున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత స్టోక్స్ బౌలింగ్ లోనే జైస్వాల్ అవుట్ అయ్యాడు. అప్పటికే జైస్వాల్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశాడు.
