టీమిండియా, బీసీసీఐలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి విషం కక్కింది. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు క్రికెట్ టోర్నీలు వాయిదాపడ్డాయి.

ఇదే సమయంలో ఆసియా కప్ షెడ్యూల్‌ను సైతం మార్చేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందంటూ పాక్ ఆరోపిస్తోంది. ఐపీఎల్‌ను నిర్వహించేందుకే భారత్ ఆసియా కప్‌నే మార్చాలని ప్రయత్నిస్తోందని పీసీబీ అంటోంది.

Also Read:కరోనా దెబ్బ: క్రికెటర్లకు జీతాలు లేవు, అయోమయంలో ఆటగాళ్లు!

ఒకవేళ ఐపీఎల్‌ కోసం ఆసియా కప్ షెడ్యూల్ మార్చితే తాము అంగీకరించబోమని పాక్ తేల్చి చెప్పింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. వాస్తవానికి ఈ మెగా టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి వున్నా కారాణాల వల్ల దుబాయ్‌లో జరుగుతోంది.

ఐపీఎల్ నిర్వహణ కోసం ఆసియాకప్‌ను నవంబర్-డిసెంబర్‌ల మధ్యకు మార్చాలనే చర్చలు ప్రారంభించినట్లుగా తమకు సమాచారం ఉందని పీసీబీ ఆరోపిస్తోంది. ఆసియా కప్ సభ్యత్వ దేశాల్లో ఉన్న ఒక దేశం కోసం షెడ్యూల్‌ను మారిస్తే అది చాలా దారుణమని పాక్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

ఇందుకు తమ సహకారం ఎట్టి పరిస్ధితుల్లోనూ ఉండబోదని పీసీబీ సీఈవో వసీం ఖాన్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ అనేది అక్టోబర్‌ 6వ తేదీన ముగుస్తుంది.. దీని తర్వాతే ఐపీఎల్‌ను ప్లాన్ చేయాలని అనుకుంటున్నారని అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే సరైన సమయంగా బీసీసీఐ భావిస్తోంది.

Also Read:భార్య చేతిలో ఓటమి.. స్టీవ్ స్మిత్ పై ట్రోల్స్

కాకపోతే ఐపీఎల్ కోసం ఆసియా కప్ షెడ్యూల్‌ను మార్చాలనే చర్చలు ఇప్పటి వరకు జరగలేదు. మరి పీసీబీ ఎందుకు ఇంత గాభరా పడుతోందోనని పలువురు విశ్లేషకులు అంటున్నారు.

ఇది ముందర కాళ్లకు బంధం వంటి చర్యేనని వాదనలు వినిపిస్తున్నాయి. కాగా షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఐపీఎల్ 13 వ సీజన్ ఆరంభం కావాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా ఉండటంతో భారత ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.