ఆక్లాండ్: న్యూజిలాండ్ పై జరిగిన రెండో వన్డేలో తాను ఔటైన తీరును వీడియోలో చూసి చాలా బాధపడ్డానని టీమిండియా క్రికెటర్ నవదీప్ సైనీ అన్నాడు. తాను ఔట్ కాకుండా ఉంటే ఫలితం మరోలా ఉండేదని అతను అన్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి సైనీ ఎనిమిదో వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే. సైనీ ఔట్ కావడంతో మ్యాచ్ ఫలితంపై ఇండియా ఆశలు గల్లంతయ్యాయి. 

జమీషన్ వేసిన బంతిని సిక్స్ కొట్టిన తర్వాత మరుసటి బంతికే అతను అవుటయ్యాడు. సిక్స్ కొట్టిన తర్వాత కామ్ గా ఆడాలని విరాట్ కోహ్లీ చెబుతుండడం కనిపించింది. ఔటైన తర్వాత వెళ్లి వీడియో చూసి చాలా బాధపడ్డానని సైనీ అన్నాడు. 

Also Read: అతని బౌలింగ్‌ అంటే భయపడుతున్న కోహ్లీ: ఏకంగా 9 సార్లు ఔట్

తాను ఔట్ కాకుండా ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని ఆయన అన్నాడు. జడేజాతో పాటు తాను చివరి వరకు ఔట్ కాకుండా ఉంటే మ్యాచును ముగించి ఉండేవాళ్లమని ఆయన అన్నాడు. వికెట్ చాలా ఫ్లాట్ గా ఉందని, దాంతో బంతి బ్యాట్ పైకి వస్తోందని అన్నాడు. 

టాపార్డర్ స్వింగ్ కు పెవిలియన్ చేరారని, మిడిల్ ఆర్డర్ అనవసరమైన షాట్లతో వికెట్లను కోల్పోయిందని, 113 బంతుల్లో 121 పరుగులు చేయాల్సిన స్థితిలో చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయని, ఆ సమయంలో తాము 76 పరుగులు చేశామని ఆయన అన్నాడు. తాను బ్యాటింగ్ చేస్తానని ఎవరూ ఊహించి ఉండరని, తాను బ్యాటింగ్ చేయగలనని ఎవరూ విని ఉండరని ఆయన అన్నాడు. 

Also Read: నీ.. దూకుడు: అలా ఎలా కుదురుతుంది... ఫీల్డ్ అంపైర్‌తో విరాట్ కోహ్లీ గొడవ

టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్టు రఘు తనలోని బ్యాటింగ్ నైపుణ్యాన్ని గుర్తించాడని, నువ్వు బ్యాటింగ్ కూడా చేయగలవని ఎప్పుడూ అంటుండేవాడని ఆయన చెప్పారు. రఘు మాటలు తనలో స్ఫూర్తిని నింపాయని, హోటళ్ల గదుల్లో కూడా తన బ్యాటింగ్ కోసం మాట్లాడేవారని, అదే తనను బ్యాటింగ్ చేయడానికి ఉపయోగపడిందని సైనీ చెప్పాడు. 

న్యూజిలాండ్ పై రెండో వన్డేలో తాను బ్యాటింగ్ కు దిగే సమయానికి చాలా పరుగులు చేయాల్సిన అవసరం ఉండిందని, మ్యాచును చివరి వరకు తీసుకెళ్లాలని జడేజా తనతో చెప్పాడని, ప్రధానంగా సింగిల్స్.. డబుల్స్ పై దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. అలా స్ట్రైక్ రొటేట్ చేస్తూ వెళ్లామని అన్నాడు. 

తాను బంతిని ఫోర్ కొట్టిన తర్వాత కాస్తా ఆశ్చర్యానికి గురయ్యానని, బ్యాట్ పైకి బంతి బాగా రావడంతో సులువుగా షాట్లు ఆడానని, అయితే తాను ఔట్ కావడం చాలా బాధించిందని ఆయన చెప్పాడు.