ICC Cricket World Cup 2023: ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్.. కప్పు కొట్టేనా..?
ICC Cricket World Cup 2023: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో తొలి రెండు మ్యాచ్ లలో పరాజయాలు చవిచూసిన ఆస్ట్రేలియా ఆ తర్వాతి ఎనిమిది మ్యాచ్ ల్లో వరుస విజయాలతో సెమీస్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఫైనల్ లోకి ఎంట్రీ అయింది.
India vs Australia: తిరుగులేని విజయాలతో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 లో ఫస్ట్ సెమీ ఫైనల్లో న్యూజీలాండ్ పై సూపర్ విక్టరీతో భారత్ ఫైనల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక గురువారం జరిగిన ప్రపంచ కప్ 2023 రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆసీస్ జట్టు పోటీ పడింది. వర్షం అంతరాల మధ్య కొనసాగిన ఈ మ్యాచ్ లో రెండు జట్లు మధ్య ఆఖరివరకు గెలుపు ఊరిస్తూ.. చివరకు ఆస్ట్రేలియాను వరించింది. దీంతో భారత్ తో పోరుకు ఫైనల్ బెర్త్ ను ఆసీస్ కన్ఫర్మ్ చేసుకుంది.
గురువారం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్లో భారత్ తో తలపడనుంది. చివరిసారిగా 2003 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో విజయం సాధించి మూడోసారి ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2007 లో తదుపరి ఎడిషన్ ను కూడా గెలుచుకుంది.
ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ మూడో ప్రపంచకప్ టైటిల్ కోసం ఆస్ట్రేలియాతో తలపడనుంది. చివరిసారిగా 2011లో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో తొలి ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. ఇక ఈ మెగా టోర్నమెంట్ లో రాబిన్ రౌండ్ లో ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయింది.
ఈ ప్రపంచ కప్ లో ఫైనల్ వరకు ఆస్ట్రేలియా ప్రయాణం గమనిస్తే.. మొదటి మ్యాచ్ లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్ లో 134 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఇక మూడో మ్యాచ్ లో శ్రీలంకపై విజయం సాధించింది. నాల్గో మ్యాచ్ లో 62 పరుగుల తేడాలో పాకిస్థాన్ ను ఓడించింది. ఐదో మ్యాచ్ లో 309 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. న్యూజీలాండ్ తో జరిగిన ఆరో మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఏడో మ్యాచ్ లో 7 పరుగుల తేడాదో ఇంగ్లాండ్ పై గెలుపొందింది. 8వ మ్యాచ్ లో ఆఫ్ఘానిస్తాన్ పై మూడు వికెట్ల తేడాతో మరో విజయం తన ఖాతాలో వేసుకుంది ఆసీస్. 9వ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సెమీ ఫైనల్ కు చేరింది.
సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాను ఓడించి భారత్‌తో ప్రపంచకప్ ఫైనల్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకుంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023లో రెండు ఓటములతో ఆస్ట్రేలియా, వరుస విజయాలతో భారత్ ఫైనల్ కు చేరుకున్నాయి. టైటిల్ పోరు రసవత్తరంగా ఉంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక గురువారం జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాకు ఇది నాలుగో ఓటమి. 1992లో ఇంగ్లాండ్, 2007, 2023లో ఆస్ట్రేలియా, 2015లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 1999లో ఆసీస్ తో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో పాల్గొన్న సఫారీ జట్లు అప్పుడు కూడా ఓటమి నుంచి తప్పించుకోలేక పోయింది.