మూడో వన్డేలోనూ అదే ఎక్స్‌పెరిమెంటా?.. మా వ్యూహం మారదు: రాహుల్ ద్రవిడ్ స్పష్టం
వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనున్న మూడో వన్డేలోనూ తమ వ్యూహం అలాగే కొనసాగుతుందని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. తమ ఎక్స్‌పెరిమెంట్ మారదని, చిన్న చిన్న విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని వివరించాడు.
WI vs IND: వన్డే వరల్డ్ కప్ 2023కి అర్హత కూడా సాధించిన వెస్టిండీస్ జట్టుపై భారత్ రెండో వన్డేలో ఓడిపోయింది. అనవసర ప్రయోగాలతో టీమిండియా పరాభవానికి గురైంది. తొలి మ్యాచ్‌లోనే టీమిండియాలో లోపాలు కనిపించాయి. రెండో వన్డేకైనా వాటిని సరిపుచ్చుకోకుండా అలాగే ఎక్స్‌పెరిమెంట్ చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్‌మెన్ విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డేకైనా ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా వీరిద్దరినీ జట్టులోకి తీసుకుని వెస్టిండీస్‌ను ఓడించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ, తాము మడమతిప్పే అవకాశమే లేదని, మూడో వన్డేలోనూ ఎక్స్‌పెరిమెంట్ కొనసాగుతుందని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూత్రప్రాయంగా చెప్పేశాడు.
తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని, తాము దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నామని రాహుల్ ద్రవిడ్ సమర్థించుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పక్కనపెట్టే నిర్ణయం సరైనదేనని ఆయన పరోక్షంగా చెప్పాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌లోనూ ఇదే వ్యూహం అమలు జరుగుతుందని దాదాపుగా చెప్పేశాడు.
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలకు సమయం ఆసన్నమవుతున్నదని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. మరో వైపు జట్టులో కీలక ఆటగాళ్లు గాయలతో కొట్టుమిట్టాడుతున్నారని వివరించాడు. కాబట్టి, ఇలాంటి క్లిష్ట సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సే ఉంటుందని చెప్పాడు. రానున్న మెగా ఈవెంట్ల దృష్ట్యా ప్రత్యామ్నాయాలను వెతకడం అవసరం అని వివరించాడు.
Also Read: 'వన్డే, టి20ల్లో టీమిండియా తుస్సు, టెస్టుల్లోనే ప్రతాపం'
ప్రతి చిన్న విషయంపై లోతుగా ఆలోచించనక్కర్లేదని, అలాగే, ప్రతి మ్యాచ్‌నూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాహుల్ ద్రవిడ్ వివరించాడు. అలా ప్రతి చిన్న విషయాన్ని దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటూ పెద్ద తప్పు చేసినవాళ్లమవుతామని స్పష్టం చేశాడు.