Rohit Sharma: వైజాగ్ వన్డేలో రోహిత్ చరిత్ర.. 20 వేల పరుగుల క్లబ్‌లో మనోడి మాస్ ఎంట్రీ !
Rohit Sharma : విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ 20,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేశాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు.

హిట్‌మ్యాన్ @ 20,000.. దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ పరుగుల సునామీ!
టీమిండియా మాజీ కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. పరుగుల వరద పారిస్తూ టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ వంటి ఎలైట్ జాబితాలో చేరారు.
విశాఖపట్నం లో దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్ ఈ అరుదైన ఘనతను సాధించారు. అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న రోహిత్, భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
ఆ ముగ్గురి తర్వాత రోహిత్ శర్మనే.. 18 ఏళ్ల కెరీర్‌లో మరో అద్భుతం!
విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, దక్షిణాఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ ఈ రికార్డును అందుకున్నారు. ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో కేశవ్ మహారాజ్ వేసిన నాలుగో బంతిని లాంగ్-ఆన్ దిశగా ఆడి సింగిల్ తీయడం ద్వారా రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగుల మార్కును దాటాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ముందు రోహిత్ 27 పరుగులు చేయాల్సి ఉండగా, ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడి ఈ ఘనత సాధించారు.
దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో భారతీయ బ్యాటర్‌గా, ప్రపంచవ్యాప్తంగా 14వ ఆటగాడిగా రోహిత్ నిలిచారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (34,357), విరాట్ కోహ్లీ (27,910), రాహుల్ ద్రవిడ్ (24,064) ముందు వరుసలో ఉన్నారు. సౌరవ్ గంగూలీ (18,433), ఎంఎస్ ధోని (17,092) వంటి దిగ్గజాలు టాప్-5లో చోటు దక్కించుకున్నారు.
రోహిత్ శర్మ కెరీర్ గణాంకాలు ఇవే
రోహిత్ శర్మ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటివరకు 505 మ్యాచ్‌లు (538 ఇన్నింగ్స్‌లు) ఆడి, 42.40 సగటుతో 20,006 పరుగులు సాధించారు. ఇందులో 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ సాధించిన పరుగులలో అత్యధిక భాగం వైట్-బాల్ క్రికెట్ నుండే వచ్చాయి. వన్డేల్లో 11,000కు పైగా పరుగులు, టీ20ల్లో 4,000కు పైగా పరుగులు ఆయన ఖాతాలో ఉన్నాయి.
టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ రోహిత్ శర్మ
టీ20 ఫార్మాట్‌లో 159 మ్యాచ్‌లలో 4,231 పరుగులతో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించారు. ఇక టెస్టు క్రికెట్‌లోనూ 4,301 పరుగులు సాధించి సత్తా చాటారు. ఐసీసీ టోర్నీలలో, ద్వైపాక్షిక సిరీస్‌లలో రోహిత్ చూపిన స్థిరమైన ఆట తీరు ఆయనను ఈ స్థాయికి చేర్చింది.
భారతదేశం తరపున అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ప్లేయర్లు
- సచిన్ టెండూల్కర్ - 34357 పరుగులు
- విరాట్ కోహ్లీ - 27910 పరుగులు
- రాహుల్ ద్రవిడ్ - 24064 పరుగుల
- రోహిత్ శర్మ - 20000** పరుగులు
- సౌరవ్ గంగూలీ - 18,433 పరుగులు
- ఎంఎస్ ధోని - 17,092 పరుగులు

