WI vs IND ODI: భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వడంతో భారీ స్కోరు చేసేందుకు ముందుకు సాగుతోంది. 

వెస్టిండీస్-ఇండియా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ నిలకడగా ఆడుతోంది. తొలి వన్డేలో తృటిలో విజయం చేజారిన నేపథ్యంలో కీలక మ్యాచ్ ఆడుతున్న కరేబియన్ జట్టు.. ఈ వన్డేలో తప్పక నెగ్గాలనే పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నది. ఆ జట్టు ఓపెనర్లు షాయి హోప్, కైల్ మేయర్స్ (39) లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ షమ్రా బ్రూక్స్ (35) ఆకట్టుకున్నాడు.32 ఓవర్లు ముగిసేటప్పటికీ 3 వికెట్ల నష్ఠానికి 175 పరుగులు చేసింది. షాయి హోప్ (79 నాటౌట్), నికోలస్ పూరన్ (20 నాటౌట్) క్రీజులో ఆడుతున్నారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన వెస్టిండీస్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. హోప్ తో పాటు మేయర్స్ లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్ తో ఖాతా తెరిచాడు హోప్. తొలి వన్డే ఆడుతున్న అవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతిని బౌండరీ బాదగా.. చివరి రెండు బంతులను మేయర్స్ బౌండరీకి తరలించాడు.

ఆ తర్వాత ఓవర్లో కూడా అవేశ్ ను ఈ ఇద్దరూ వదిలిపెట్టలేదు. ఈ ఓవర్లో కూడా మూడు ఫోర్లు బాదారు. దీంతో విండీస్ స్కోరు ధాటిగా ముందుకు కదిలింది. ఇక శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో మేయర్స్.. 4,6 బాదాడు. దూకుడుగా ఆడుతున్న మేయర్స్ ను దీపక్ హుడా.. తాను వేసిన తొలి బంతికే ఔట్ చేశాడు. దీంతో 65 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

వన్ డౌన్ లో వచ్చిన బ్రూక్స్ కూడా ధాటిగానే ఆడాడు. వీలుచిక్కినప్పుడల్లా బ్రూక్స్-హోప్ లు బంతిని బౌండరీకి తరలించారు. చాహల్ వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్లో ఐదో బంతిని సిక్సర్ గా తరలించిన హోప్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 

Scroll to load tweet…

రెండో వికెట్ కు 65 పరుగులు జోడించిన క్రమంలో ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. అతడు వేసిన ఇన్నింగ్స్ 21.3 ఓవర్లో బ్రూక్స్.. ధావన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే క్రమంలో విండీస్ కు భారత్ మరో షాకిచ్చింది. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బ్రాండన్ కింగ్ (0) ను చాహల్ పెవిలియన్ కు పంపాడు. దీంతో విండీస్ 130 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.

ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ నికోలస్ పూరన్ తో కలిపి హోప్స్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. మరో 20 ఓవర్లు మిగిలిఉండటం.. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుండటంతో విండీస్.. 300 ప్లస్ స్కోరు చేసి భారత్ ముందు భారీ టార్గెట్ పెట్టాలనే భావనతో ఆడుతున్నది.