టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు ఐపిఎల్ లోనూ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఇప్పటికే అతడే దాదాపు పరిమిత ఓవర్ల క్రికెట్ కు దాదాపు దూరమవగా టెస్టుల్లో కూడా దారులు  మూసుకుపోయాయి. వెస్టిండిస్ గడ్డపై ఘనమైన రికార్డున్నప్పటికి అతన్ని రెండు టెస్టుల్లోనూ పక్కనబెట్టారంటేనే టీమిండియా మెనేజ్‌మెంట్ ఆలోచనను అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా ఐపిఎల్ లో కూడా అతడిపై వేటు వేసేందుకు కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ప్రస్తుతం కెప్టెన్ గా అశ్విన్ కొనసాగుతున్నాడు. అయితే  గత రెండు సీజన్లలోనూ అతడి సారథ్యంలోని జట్టు ఘోరంగా విఫలమయ్యింది. దీంతో 2020 సీజన్ లో అతన్ని కొనసాగించకూడదని పంజాబ్ యాజమాన్యం భావిస్తోందట. కేవలం అశ్విన్ ను కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలగించడమే కాదు జట్టు నుండే తొలగించే ప్రయత్నంలో పంజాబ్ యాజమాన్యం వుంది. ఇందుకోసం రాజస్థాన్ రాయల్స్, డిల్లీ క్యాపిటల్స్ జట్టుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 

అయితే అశ్విన్ ను పంజాబ్ జట్టు వదులుకుంటే తాము తీసుకోడానికి సిద్దంగా వున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మెంటార్ గంగూలీ తెలిపాడు. ప్రస్తుతం తమ జట్టు బ్యాటింగ్ లో అదరగొడుతున్నా బౌలింగ్ విషయంలో తడబడుతోంది. అందువల్లే  పరస్పర అంగీకారంతో అశ్విన్ ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు గంగూలీ వెల్లడించాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అశ్విన్ ను తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. కానీ డిల్లీ, రాజస్థాన్ లలో ఏ జట్టు అశ్విన్ ను దక్కించుకున్నా కెప్టెన్సీ పగ్గాలను మాత్రం అప్పగించే అవకాశముండదు. కాబట్టి గత రెండు సీజన్లలో కెప్టెన్ గా బరిలోకి దిగిన అతడు వచ్చే ఐపిఎల్  నాటికి సాధారణ ఆటగాడిగా మారనున్నాడన్న మాట. 
  
2018 ఐపీఎల్‌ వేలంలో పంజాబ్‌ అశ్విన్‌ పై భారీ ఆశలతో ఏకంగా రూ.7.8కోట్లకు కొనుగోలు చేసింది. అయితే వారు ఆశించిన ప్రదర్శన గత రెండేళ్లుగా అశ్విన్ నుండి రాలేదు. దీంతో అతడిపై వేటు వేసేందుకు మొగ్గు చూపిస్తున్నారట.   

సంబంధిత వార్తలు

అశ్విన్ కు మరో ఎదురుదెబ్బ....ఈసారి కెఎల్ రాహుల్ రూపంలో