టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు వెస్టిండిస్ టెస్ట్ సీరిస్ లో ఎదురుదెబ్బ తగిలింది. విండీస్ గడ్డపై మంచి ట్రాక్ రికార్డున్నప్పటికి అతడికి మొదటి టెస్ట్ ఆడే అవకాశం  రాలేదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో తప్పకుండా అవకాశం వస్తుందనుకున్న అతడికి టీమిండియా మేనేజ్ మెంట్ మొండిచేయి చూపించింది. ఇప్పటికే చాలారోజులుగా పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరమైన అతడు ఇకపై టెస్ట్ క్రికెట్ కు దూరమవనున్నాడా అన్న అనమానాలు అభిమానల్లో మొదలయ్యాయి. అతడి అంతర్జాతీయ  కెరీర్ ఇంచుమించు ముగిసినట్లేనని అభిమానులే  కాదు క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. 

ఇలా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఎదుదెబ్బలు తింటున్న అతడికి ఐపిఎల్ లో కష్టాలు మొదలయ్యాయి. ఈ లీగ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కెప్టెన్ గా అశ్విన్ గత సీజన్లు వ్యవహరించాడు. అయితే ఈ రెండు సీజన్లలోనూ అతడి సారథ్యంలోని జట్టు ఘోరంగా విఫలమయ్యింది. దీంతో 2020 సీజన్ లో అతన్ని కొనసాగించకూడదని పంజాబ్ యాజమాన్యం భావిస్తోందట. అందుకోసం ఇప్పటినుండే చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

కేవలం అశ్విన్ ను కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలగించడమే కాదు జట్టు నుండే తొలగించే ప్రయత్నంలో పంజాబ్ యాజమాన్యం వుంది. ఇందుకోసం రాజస్థాన్ రాయల్స్, డిల్లీ క్యాపిటల్స్ జట్టుతో చర్చలు జరుపుతోందట. పరస్పర అంగీకారంతో అశ్విన్ ను వదులుకుని అతడి స్థానంలో మరో ఆటగాన్ని జట్టులోకి తీసుకోవాలని కింగ్స్ ఎలెవన్ జట్టు యాజమాన్య భావిస్తున్నట్లు సమాచారం. ఈ వారం చివరికల్లా దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. 

డిల్లీ క్యాపిటల్స్ గత సీజన్లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో వచ్చే సీజన్లో కూడా డిల్లీ జట్టుకు అతడే కెప్టెన్ గా వ్యవహరించడం ఖాయం. ఇక రాజస్ధాన్ జట్టు కూడా అజింక్య రహానే, స్టీవ్ స్మిత్ ల కెప్టెన్సీలో గత సీజన్లో బరిలోకి దిగింది. వీరిద్దరిలో ఎవరో ఒకరికి పూర్తిస్థాయి కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించి 2020 ఐపిఎల్ లో బరిలోకి దిగనుంది. ఏ విధంగా చూసుకున్నా వచ్చే సీజన్లో అశ్విన్ కెప్టెన్సీ పోస్ట్ ఊడటం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇక అశ్విన్ ను కెప్టెన్ గా తొలగించి కెఎల్ రాహుల్ కు ఆ బాధ్యతలు అప్పగించాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తుందట. డిల్లీ జట్టు యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి మంచి ఫలితాలను రాబడుతోంది. కాబట్టి  తాము కూడా అదే ఫార్ములాను ఫాలో కావాలని పంజాబ్ ప్రాంచైజీ చూస్తోందట. అందువల్ల అంతర్జాతీయ క్రికెట్లోనూ, గత ఐపిఎల్ సీజన్లోనూ రాణించిన కెఎల్ రాహుల్ కు సారథ్య బాధ్యతలు అప్పగించడాని దాదాపు సిద్దమైందట. అధికారికంగా ఓసారి సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకకోవడమే ఇక మిగిలిపోయినట్లు తెలుస్తోంది. 

2018 ఐపీఎల్‌ వేలంలో పంజాబ్‌ అశ్విన్‌ పై భారీ ఆశలతో ఏకంగా రూ.7.8కోట్లకు కొనుగోలు చేసింది. అయితే వారు ఆశించిన ప్రదర్శన గత రెండేళ్లుగా అశ్విన్ నుండి రాలేదు. దీంతో అతడిపై వేటు వేసేందుకు మొగ్గు చూపిస్తున్నారట.