Australia Vs England: తొలి ఇన్నింగ్సులో  తక్కువ స్కోరుకే ఆలౌట్ అయి కష్టాలను కొని తెచ్చుకున్న ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నది.  

ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. తొలి రెండు రోజులు ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించగా.. ఆట మూడో రోజు ఇంగ్లాండ్ ఆ క్రెడిట్ కొట్టేసింది. తొలి ఇన్నింగ్సులో తక్కువ స్కోరు (147)కే ఆలౌట్ అయి కష్టాలను కొని తెచ్చుకున్న ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ నిర్దేశించిన 278 పరుగులను ఛేదించే క్రమంలో ఆ జట్టు.. రెండు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, డేవిడ్ మలన్ లు సెంచరీల వైపునకు దూసుకుపోతున్నారు. 

మూడో రోజు 343 పరుగుల వద్ద ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. 425 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్.. ఈ రోజు కూడా ధాటిగా ఆడాడు. మొత్తంగా 148 బంతులాడిన అతడు.. 152 పరుగులు చేశాడు. అతడికి బౌలర్ మిచెల్ స్టార్క్ (35) సహకారమందించాడు. దీంతో ఆసీస్ 278 పరుగుల ఆధిక్యం సాధించింది. 

Scroll to load tweet…

రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ కష్టాలు వెంటాడాయి. ఓపెనర్లు.. రోరీ బర్న్స్ (13) ఇన్నింగ్స్ 8వ ఓవర్లోనే కమిన్స్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ హమీద్ (27) కూడా 20 వ ఓవర్లో హెజిల్వుడ్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

వీరి తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ మలన్ (177 బంతుల్లో 80 నాటౌట్), జో రూట్ (158 బంతుల్లో 86 నాటౌట్) మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. జోరుమీదున్న ఆసీస్ పేస్ త్రయం కమిన్స్, స్టార్క్, హెజిల్వుడ్ తో పాటు స్సిన్నర్ నాథన్ లియాన్ ను సమర్థంగా ఎదుర్కున్నారు. ఆట రెండో సెషన్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఈ ఇద్దరూ.. పట్టుదలగా ఆడారు. హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న ఈ ఇద్దరూ.. మూడో వికెట్ కు 159 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయినా ఇంగ్లాండ్ ఇంకా 58 పరుగులు వెనుకబడే ఉంది. 

ఇదీ చదవండి : Ashes 2021-22: ఆస్ట్రేలియా అమ్మాయి.. ఇంగ్లాండ్ అబ్బాయి.. యాషెస్ కలిపింది ఇద్దరినీ...!

ఈ క్రమంలో జో రూట్ ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టెస్టులలో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది 14 టెస్టులాడిన రూట్.. 1,541 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలూ ఉన్నాయి. ఈ రికార్డు అంతకుముందు మైకెల్ వాన్ పేరిట మీద ఉంది. 2016లో 17 టెస్టులాడిన వాన్.. 1,481 పరుగులు చేశాడు.

రూట్, మలన్ లు ఇదే జోరు కొనసాగిస్తే నాలుగో రోజు ఈ ఇద్దరూ సెంచరీలు చేయడంతో పాటు ఇంగ్లాండ్ కు ఆధిక్యంలోని తీసుకురావడం గ్యారెంటీ. ఇంకా ఇంగ్లాండ్ కు 8 వికెట్లు చేతిలో ఉండటం.. మరో రెండ్రోజుల ఆట మిగిలుండటంతో ఈ టెస్టు ఆసక్తికరంగా మారింది.