ధోనిని టీమిండియా కెప్టెన్ చేసింది అందుకే.. సచిన్ టెండూల్కర్ సంచలన వ్యాఖ్యలు
Sachin Tendulkar - MS Dhoni : భారత క్రికెట్ జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీని బీసీసీఐ కెప్టెన్‌గా ఎలా నియమించింది అనే రహస్యాన్ని క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయటపెట్టాడు. 2007లో ధోని ఎలా కెప్టెన్ అయ్యాడనే అంశంపై సచిన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Team India : లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ అవకాశం వచ్చినా కాదనీ, అప్పట్లో టీమిండియా యంగ్ ప్లేయర్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని (ఎంఎస్ ధోని) పేరును సూచించాడు. భారత కెప్టెన్ గా ధోని ఎలా అయ్యాడు? ఎందుకు అయ్యాడు? అనే విషయాలను వివరిస్తూ ఎంఎస్ ధోనిపై లిటిల్ మాస్టర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ధోనీ కెప్టెన్‌గా ఎలా మారాడనే దాని గురించి చెప్పలేని రహస్యాన్ని బట్టబయలు చేసిన సచిన్..ఈ నిర్ణయం భారత క్రికెట్ జట్టు అదృష్టాన్ని మార్చిందని పేర్కొన్నాడు. బీసీసీఐ 2007లో సచిన్ టెండూల్కర్ కు కెప్టెన్సీని ఆఫర్ చేసింది, అయితే తన ఆరోగ్య పరిస్థితి కారణంగా దానిని తిరస్కరించాడు. ఈ క్రమంలోనే అప్పుడే టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా ఎదుగుతున్న ఎంఎస్ ధోని ప్రశాంతమైన ప్రవర్తన, అతని నిర్ణయాత్మక శక్తిని గమనించిన అతన్ని బ్యాటింగ్ మాస్ట్రో సచిన్ సిఫారసు చేసినట్టు వెల్లడించాడు.
"2007లో బీసీసీఐ నాకు కెప్టెన్సీని ఇచ్చింది, కానీ అప్పటి నా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఎంఎస్ ధోని గురించి నా పరిశీలన చాలా బాగుంది. అతని మనస్సు చాలా స్థిరంగా ఉంటుంది, అతను ప్రశాంతంగా, సహజసిద్ధంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. నేను అతనిని కెప్టెన్సీకి సిఫార్సు చేసానని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు.
ధోని కెప్టెన్సీలో తిరుగులేని జట్టుగా భారత్..
భారత జట్టుకు విజయవంతమైన కెప్టెన్లలో ధోని ముందుంటాడు. మూడు ఫార్మాట్ లలో భారత్ ను ఛాంపియన్ గా నిలిపాడు. ధోని కెప్టెన్సీలో భారత్ 2007లో టీ20 ప్రపంచ కప్, 2011 క్రికెట్ ప్రపంచ కప్, 2013 ఐసీసీఛాంపియన్స్ ట్రోఫీ వంటి అనేక ముఖ్యమైన క్రికెట్ టోర్నమెంట్లలో విజయం సాధించింది. 'మ్యాన్ విత్ మిడాస్ టచ్' భారత క్రికెట్ జట్టును వారి చరిత్రలో తొలిసారిగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి తీసుకెళ్లింది.
కాగా, ఎంఎస్ ధోని జనవరి 2017లో వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఫార్మాట్‌ల కెప్టెన్సీని వదులుకుని విరాట్ కోహ్లీకి అప్పగించాడు. 2014లో ధోనీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చాడు. కెప్టెన్ కూల్ అని ముద్దుగా పిలుచుకునే ధోని.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో 200 మ్యాచ్‌లలో 110 విజయాలు, టీ20 ఫార్మాట్ లో 41 విజయాలతో.. ఈ రెండు ఫార్మాట్ లలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పిన ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహి ఇప్పటివరకు ఐదు టైటిళ్లను అందించాడు. ఐపీఎల్ 2024 లో కూడా టైటిల్ పై కన్నేశాడు.
BKS VS DC HIGHLIGHTS : పంజాబ్ చేతిలో ఢిల్లీ చిత్తు.. ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్ హైలెట్స్.. !